Darsi: వైసీపీలో మారుతున్న సమీకరణాలు... ఒక్కొక్కరిగా బయటకు అసంతృప్త ఎమ్మెల్యేలు

by srinivas |   ( Updated:2023-07-02 13:01:35.0  )
Darsi: వైసీపీలో మారుతున్న సమీకరణాలు... ఒక్కొక్కరిగా బయటకు అసంతృప్త ఎమ్మెల్యేలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నారు. వీరి కోవలోకి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేరారు. గత కొంతకాలంగా వేణుగోపాల్ నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డితో నెలకొన్న ఆధిపత్యపోరుతో కొన్నాళ్లు పార్టీలో సైలెంట్ అయ్యారు. అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటును తట్టుకోలేకపోతున్నారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ ప్రతీ సమీక్షలో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు వేణుగోపాల్‌కు చిర్రెత్తుకొచ్చాయి. దర్శి నియోజకవర్గానికి ఏదో సేవ చేయాలని తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందితే రాజకీయ ఆధిపత్యపోరు తనకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ ద్వారా శివప్రసాదరెడ్డి తనకు సహాయ నిరాకరణ చేస్తున్నారని పలుమార్లు వాపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు నవరత్నాల పథకాల అమలుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ నిత్యం బటన్ నొక్కితే ఆయన గ్రాఫ్ పెరుగుతుందే కానీ తమ గ్రాఫ్ ఎక్కడ పెరుగుతుందంటూ బరస్ట్ అయ్యారు. సీసీ రోడ్లు వేస్తే, మంచి నీళ్లు ఇస్తే ప్రజల్లో గ్రాఫ్ పెరుగుతుంది కానీ నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కితే తమకు ఎక్కడ గ్రాఫ్ పెరుగుతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా ఎమ్మెల్యే వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


మా గ్రాఫ్ ఎలా పెరుగుతుంది

ప్రకాశం జిల్లా వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తన అసహనాన్ని ఏదో ఒక వేదికపై బయటపెడుతూనే ఉన్నారు. అయితే ఇటీవలే మరోసారి తన మనసులోని అసంతృప్తిని బయటపెట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా డబ్బులు జమచేయడం వల్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరడగడం లేదంటూ అక్కసు వెళ్లగక్కారు. అంతేకాదు వైసీపీ కార్యకర్తలు అప్పులపాలయ్యారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పార్టీదేనని చెప్పారు. దర్శి నియోజకవర్గంలో పనులన్నీ వైసీపీ కార్యకర్తలకే అప్పగించానని, అయితే సకాలంలో ప్రభుత్వం బిల్లులు విడుదల చేయదపోవడంతో వారంతా అప్పులపాలయ్యారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చెబుతున్నారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం నుంచి కార్యకర్తలకు రావాల్సిన పేరుకుపోయిన బిల్లులు మంజూరు చేయాలని మద్దిశెట్టి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కార్యకర్తల్లో బయటకి కనిపిస్తున్న ఆనందం.. వారి జీవితాల్లో లేదని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తమను నిలదీస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇలా అయితే ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతే

బటన్ నొక్కడం మాత్రమే కాదని శాశ్వత ప్రాతిపదికన పనులు జరగడం లేదని వేణుగోపాల్ విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రోడ్లు ఎప్పుడు వేస్తారు?. నీళ్లు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పారు. గడప లోపల బాగుంది గానీ.. గడప బయట మాత్రం పరిస్థితి ఏం బాగోలేదని తెలిపారు. నవరత్నాల పేరుతో సీఎం జగన్‌ బటన్ నొక్కడం వల్ల ఆయనకే నేరుగా క్రెడిట్ వెళ్తోంది గానీ ఎమ్మెల్యేలకు ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు గ్రామాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వేయాలని.. చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని.. లేకుంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను లేవనెత్తిన అంశాలను పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వేణుగోపాల్ కోరారు.

వేణుగోపాల్, వర్సెస్ బూచేపల్లి

దర్శి వైసీపీలో మొదటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య నిత్యం ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తల్లి జెడ్పీ చైర్‌పర్సన్ కావడంతో పాలనాపరమైన వ్యవహారంలో ఇరువురి మధ్య అంతర్గత పోరు పెరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదే అంటే తనదేనని ఇరువురు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. అటు వేణుగోపాల్ ఇటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇదే తరుణంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు శివప్రసాద్ రెడ్డి తల్లి జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ సహాయనిరాకరణ చేస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సైతం ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. శివప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్‌ల మధ్య ఆధిపత్యపోరు తగ్గకపోతే ఖచ్చితంగా తమ కుటుంబానికే టికెట్ ఇస్తుందనే నమ్మకంతో శిద్ధా రాఘరావు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed