అసలు జగన్‌కు మానవత్వం ఉందా: Chandrababu

by srinivas |
అసలు జగన్‌కు మానవత్వం ఉందా: Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: ‘అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా. పుట్టెడు కష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు ఆదుకునేందుకు చేతులు రావా. ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు ఎంతెంత దెబ్బతిన్నాయో తెలుసా. గాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా. ఒక్కసారి నేల మీదకు సీఎం జగన్​ వస్తే అన్నదాతల అవస్థలు తెలుస్తాయి.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. శనివారం పర్చూరులో గుమికూడిన రైతులతో ఆయన మాట్లాడారు. ‘ఉప్పుటూరు నుంచి వస్తూ చూశాను.. పర్చూరులో పంట కాలువకు అటుపక్క, ఇటుపక్క గట్లన్నీ వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. తుఫాను వచ్చింది.. మీ కొంప ముంచింది. నాలుగైదు సంవత్సరాలుగా వైసీపీ అసమర్థ పాలనతో అడుగడుగున మీ జీవితాల్లో చీకటి నెలకొంది.’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘లక్షలాదిమంది రైతులు సర్వస్వాన్ని కోల్పోయారు. సైకో ముఖ్యమంత్రి పట్టిసీమ నుంచి నీళ్ళు వదలకుండా పంపులను నిలిపేశారు. వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించలేదు. ఒక్క డ్రైన్ రిపేరు చేయలేదు. దీంతో కంపచెట్లు మొలిచాయి. డ్రైన్‌లో పోవాల్సిన నీరు పొలంపైకి వచ్చి పంట మునిగిపోయింది. పంటలు నష్టపోయి రైతులు అందరూ అప్పులపాలయ్యారు. నలుగురు కౌలు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి చనిపోయారు. హనుమంతరావు అనే వ్యక్తి మిరప పంట నాశనమైతే ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయలేదు. దీంతో అతను ప్రభుత్వం ఆదుకుటుందనే విశ్వాసాన్ని కోల్పోయారు’అంటూ టీడీపీ హయాంలో రైతుల కోసం చేసిన కార్యక్రమాలను చంద్రబాబు గుర్తు చేశారు.

‘నిద్రాహారాలు మాని సేవ చేసేవాడే నాయకుడు. ప్రభుత్వ వైఫల్యాలు ఒకటి, రెండు కాదు. నష్టపోయిన రైతుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందించి ఉంటే రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగేది. టీడీపీ హయాంలో పత్తి, పొగాకు, చెరుకు ఇలా అన్నింటికి నష్టపరిహారం ఇచ్చాం. జగన్ చేసిన తప్పుడు పనుల వల్ల 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. 11 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. ఏంచేశారు?. రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. అభివృద్ధి లేదు. మతం, కులం కావాలి. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. ఉత్తిత్తి బటన్‌లు నొక్కుతుంటారు. వ్యక్తిగతంగా బూతులు మాట్లాడటం నాకు చేతకాదు. హుందాగా రాజకీయాలు చేయాలి. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టాలనేదే నా సిద్ధాంతం. రాష్ట్రం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించి మీ వద్ద ప్రతిపాదన పెడతా ’అని చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.

బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్న పాలెంలో రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అజ్ఞాని, అహంభావి అయిన సీఎం వల్ల లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను వల్ల వాగులు, వంకలకు గండ్లు పడతాయనే స్పృహ లేకుండా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లే నేడు గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఇస్తున్న ప్రోద్బలంతా సమ న్యాయం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed