Prakasam: కట్టుకున్నోడే కడ తేర్చాడు!

by srinivas |
Prakasam: కట్టుకున్నోడే కడ తేర్చాడు!
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజనీరు రాధ హత్య కేసు మరో మలుపు తీసుకుంది. ఆమె భర్తే హంతకుడని పోలీసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. తొలుత అప్పు తీసుకున్న వ్యక్తి చంపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో భావించారు. లోతుగా దర్యాప్తు జరిగాక కట్టుకున్నోడే ముందస్తు ప్లాన్​ప్రకారం హతమార్చినట్లు తెలుస్తోంది.

వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు సమీపంలో రాధ శవమై తేలింది. గుండ్లపల్లికి చెందిన కాశిరెడ్డితో ఆమెకు ఉన్న ఆర్థిక లావాదేవీల వల్లే రాధ హత్య జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధ భర్తను కూడా పోలీసులు విచారించారు. ఆయన చెప్పే మాటలకు, ఫోన్‌ లొకేషన్‌కు సంబంధమే లేదని గుర్తించారు. దీంతో అనుమానం పెరిగింది. హంతుకుడిని పట్టుకునేందుకు విచారణకు సహకరించాలంటూ పోలీసులు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మోహన్​రెడ్డిని లోతుగా విచారించగా రాధను హత్య చేసింది భర్తేనని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. కనిగిరిలోని పామూరు బస్టాండ్‌లో కారు ఎక్కించుకుని వెళ్లి ఆమెను చున్నీతో ఉరేసి హతమార్చినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించినట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు బయటపడ్డాయి. రాధ, మోహన్​రెడ్డి మధ్య గత కొంత కాలంగా మనస్పర్థలున్నాయి. ఇద్దరూ ఓ దశలో విడిపోయేందుకు సిద్ధమయ్యారు. రాధ షేర్స్‌లో పెట్టుబడి కోసం ఇటీవల రూ.10 లక్షలు ఇవ్వాలని భర్తను అడిగిందట. దీంతోపాటు ఆమె ఇతరులతో చనువుగా ఉంటుందనే అనుమానంతో భార్యను అంతమొందించాలని మోహన్​రెడ్డి నిర్ణయించుకున్నారు. వీళ్ల వద్ద రూ.70 లక్షలదాకా అప్పు తీసుకున్న కాశిరెడ్డి రాధతో ఫోన్‌ ఛాటింగ్‌ చేసినట్లుగా భర్త మోహన్‌రెడ్డి ఛాటింగ్‌ చేశారు. ఛాటింగ్‌ ప్రకారం కాశిరెడ్డి స్థానంలో భర్త మోహన్‌రెడ్డి రావడంతో రాధ ఆందోళనకు గురై కారు ఎక్కేందుకు నిరాకరించింది. అయితే భర్త మోహన్‌రెడ్డి ఆమెను బుజ్జగించి మీ ఊరికి వెళదామంటూ నమ్మబలికి కారు ఎక్కించుకున్నారు. కారులోనే ఆమె చున్నీతో మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

రాధ తల్లిదండ్రులు మరో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాధ పేరుతో రూ.1.50 కోట్లు ఇన్సూరెన్స్‌ చేసిన ఆ డబ్బు కోసమే రాధను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. విడాకులకు సిద్ధమైన తరుణంలో భర్త మోహన్‌రెడ్డి రాధను హత్య చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అడిషనల్‌ ఎస్పీ శ్రీధర్‌రావు పర్యవేక్షణలో డీఎస్పీ రామరాజు హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story