YSRCP: కొండేపి వైసీపీలో కలహాలు.. తారాస్థాయికి చేరిన విభేదాలు

by srinivas |
YSRCP: కొండేపి వైసీపీలో కలహాలు.. తారాస్థాయికి చేరిన విభేదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఇన్‌చార్జి అశోక్ బాబు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్యల మధ్య వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇరువర్గాలు ఒకరినొకరు సహాయనిరాకరణ చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో వరికూటి అశోక్ బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుంటే అందుకు వ్యతిరేకంగా మాదాసి వెంకయ్య వర్గం నిరసన తెలుపుతోంది. మా ఇంటికి రావొద్దు అశోక్ బాబు అంటూ స్టిక్కర్లు వేస్తున్నారు. దీంతో కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు నువ్వా నేనా అన్నరీతిలో ఉంది. ఇరువురు నేతలను ఎలా సముదాయించాలో తెలియక వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది.


మిట్టపాలెంలో వెలసిన స్టిక్కర్లు

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ నాయకుల మధ్య ఉన్న వర్గపోరు వీధికెక్కింది. కొండేపి నియోజకవర్గం ఇన్‌చార్జి వరికూటి అశోక్ బాబు, మాదాసి వెంకయ్య వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. వరికూటి అశోక్ బాబు , మాదాసి వెంకయ్య వర్గాలు ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వరికూటి అశోక్ బాబు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా....మాదాసి వెంకయ్య టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వర్గీయుడిగా ఉంటూ ఎవరికి నచ్చిన విధంగా వారు రాజకీయం చేస్తున్నారు. ఇది కాస్తా వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటుంది.


కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వెంకయ్యను తప్పించి వరికూటి అశోక్ బాబును నియమించినప్పటి నుంచి అసమ్మతి మరింత పెరిగింది. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీ పడడంతో మాదాసి వర్సెస్ వరికూటిగా కొడేపి నియోకవర్గంలో వైసీపీ పరిస్థితి మారింది. క్యాడర్‌ను సమన్వయం చేసుకోవడంలో నాడు మాదాసి వెంకయ్య విఫలం కాగా ఇప్పుడు వరికూటి సైతం విఫలమయ్యారనే ప్రచారం ఉంది. దీంతో మాదాసి వెంకయ్య తాడేపల్లిలో ఏకంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

తాజాగా గురువారం కొండెపిలో వరికూటి అశోక్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. కొండేపి మండలం మిట్టపాలెంలో వరికూటి అశోక్ బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే వరికూటి పర్యటనను మాదాసి వెంకయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మా ఇంటికి రావొద్దు అశోక్ బాబు అంటూ గ్రామంలో సుమారు వద నివాసాలకు స్టిక్కర్లు అతికించారు. దీంతో మిట్టపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తాజా పరిణామాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్య్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.

బాలినేని అనుచరుడిగా వరికూటి

కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి అశోక్ బాబు కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని మాదాసి వెంకయ్య ఆరోపిస్తున్నారు. అశోక్ బాబును ఇన్ చార్జిగా తప్పించాలని వెంకయ్య వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దే తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇటీవలే కొండేపి వైసీపీ ఇన్ చార్జి పదవి నుంచి వరికూటి అశోక్ బాబును తప్పించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలో అసంతృప్త వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో 60 కార్లతో 200 మందికి పైగా నాయకులు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సేవ్ కొండేపి సేవ్ వైసీపీ అంటూ నినదించారు. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వరికూటి అశోక్ బాబుపై వైసీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరికూటి అశోక్ బాబు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు. బాలినేని శ్రీనివాసరెడ్డికి అధిష్టానం వద్ద పట్టుండటంతో వరికూటి అశోక్ బాబుపై ఈగ వాలనీయకుండా చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

వైవీ వర్గీయుడిగా వెంకయ్య

మాదాసి వెంకయ్యకు వైద్యుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. అయితే వైసీపీతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో వరికూటి అశోక్ బాబును కాదని సీఎం జగన్ మాదాసి వెంకయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే వైసీపీ వేవ్‌లో కూడా టీడీపీ చేతిలో మాదాసి ఓటమి పాలయ్యారు. అది కూడా స్వల్ప చేతిలో ఓడిపోయారు. దీంతో మాదాసిపై సానుభూతి చూపించిన అధిష్టానం ఎన్నికల అనంతరం పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవితో పాటు కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది.

అయితే కొద్దికాలానికే వెంకయ్యపై వ్యతిరేకత వ్యక్తమైంది. రాజకీయ చతురత, అనుభవం లేకపోవడం, ఫుల్ టైం పాలిటిక్స్‌కు సమయం కేటాయించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య అంతర్గత పోరును పరిష్కరించడంలో విఫలమయ్యారనే టాక్ ఉంది. అంతేకాదు నియోజకవర్గంలో తన వ్యతిరేక వర్గ నాయకులపై కేసులు పెడతానని బెదిరించిన ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో కొందరు మాదాసిపై నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి వెంకయ్యను తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే వైవీ సుబ్బారెడ్డి వర్గీయుడిగా ఉన్న వెంకయ్యను కొంతకాలం కాపాడుకుంటూ వచ్చారు. అయితే వ్యతిరేకత తీవ్రంగా రావడంతో ఆయనను తప్పించి వరికూటి అశోక్ బాబుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఇరువురు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుంది.

నేను సైతం అంటున్న జూపూడి

మాదాసి వెంకయ్య, ఇన్ చార్జి వరికూటి అశోక్‌బాబుల మద్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని నాయకత్వం భావిస్తుంది. మాదాసి వెంకయ్యను ఇన్‌చార్జి నుంచి తప్పించే వరకు వరికూటి అశోక్ బాబు గట్టిగా పోరాటం చేశారు. ఇప్పుడు మాదాసి వెంకయ్య సైతం అదే రూట్‌లో వెళ్తున్నారు. పిల్లి పిల్లి కొట్టుకుంటే ఎలుక వచ్చి తన్నుకుపోయినట్లు ఈ ఇద్దరి నేతల మధ్య వర్గపోరును క్యాష్ చేసుకునేందుకు జూపూడి ప్రభాకర్ రావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ చార్జి పదవి కోసం జూపూడి ప్రభాకర్ రావు తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూపూడి ప్రభాకర్ రావు తన అనుచరులను నియోజకవర్గంలో ఎంటర్ చేసినట్లు తెలుస్తోంది. అనుచరులతో కలిసి జూపూడి తన రాజకీయ మంత్రాంగం మెుదులుపెట్టినట్లు తెలుస్తోంది. మరి టికెట్ ఎవరిని వరిస్తుందో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story