Yuvagalam: వెలుగొండ ప్రాజెక్టు పూర్తిపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-07-22 14:41:52.0  )
Yuvagalam: వెలుగొండ ప్రాజెక్టు పూర్తిపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లాకు ఆయువు పోసే వెలుగొండ ప్రాజెక్టును టీడీపీ అధికారానికి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీనిచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేశ్​ మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరల్లేక.. ఆదుకొనే దిక్కులేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో ఇచ్చే డ్రిప్​ పరికరాలను ఎత్తేశారని లోకేశ్ విమర్శించారు.

టీడీపీ అధికారానికి రాగానే ఏటా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందజేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఎక్కడైనా మహిళల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధించలేమని, మహిళా సాధికారత సాధించాలంటే ఆర్థిక సహకారం అందించాలన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే మహాశక్తి పథకం కింద ప్రతీ మహిళకు నెలనెలా రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పేరిట రూ.15 వేల చొప్పున అందిస్తామన్నారు. దీపం పథకం కింద పేదలకు ఏటా మూడు గ్యాస్​ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేదాకా నెలనెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చి కుటుంబాలకు భారం కాకుండా చర్యలు తీసుకుంటామని లోకేశ్ వెల్లడించారు. ఎక్కడికక్కడ వాటర్​ గ్రిడ్​లు ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబానికి సురక్షితమైన తాగు నీరు అందిస్తామని చెప్పారు. కరవుకు మారుపేరైన మార్కాపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నారా లోకేశ్ ప్రజలకు హామీనిచ్చారు.

Advertisement

Next Story