మెకానిక్ అవతారమెత్తిన లోకేశ్.. అధికారంలోకి రాగానే వాళ్లను ఆదుకుంటామంటూ హామీ

by Javid Pasha |
మెకానిక్ అవతారమెత్తిన లోకేశ్.. అధికారంలోకి రాగానే వాళ్లను ఆదుకుంటామంటూ హామీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల హర్యానాలో రాహుల్​ గాంధీ బైక్​ రిపేరులో మెకానిక్​ లతో చేయి కలిపారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో బైక్​ మెకానిక్​ అయ్యారు. మంగళవారం యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్​ మెకానిక్​ లతో చిట్​చాట్​ నిర్వహించారు. ఈసందర్భంగా వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేష్​ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రతీ ఏటా కొత్త కొత్త బైకులొస్తున్నాయి. బీఎస్​4 ఇంజన్ల దాకా రిపేరు చేయడం మాకొచ్చు. ఇప్పుడు బీఎస్​5, 6 ఇంజన్లు వస్తున్నాయి. వాటిని ఎలా రిపేరు చేయాలో అర్థం కావడం లేదని మెకానిక్​ లు వాపోయారు. కొత్తవి మార్కెట్లోకి వచ్చినప్పుడు మెకానిక్​లకు తగు శిక్షణ ఇస్తే బావుంటుందని చెప్పారు. అలాగే షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఇలా చిన్నచిన్న షెడ్లు పెట్టుకొని జీవిస్తున్నట్లు లోకేష్​ కు వివరించారు. బైక్​ మెకానిక్​లకు కూడా ఓ సొసైటీ లేదా కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

మెకానిక్​ల సమస్యలపై లోకేష్​ స్పందిస్తూ వీళ్లు కూడా జగన్​ బాధితులేనని వ్యాఖ్యానించారు. జగన్​ అసమర్థ పాలన, కొవిడ్​ దెబ్బకు బైక్​ల అమ్మకాలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్​ ధరలు దేశంలోనే అత్యధికంగా ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా మరో కారణమని లోకేష్​ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంటు నియోజవర్గం ప్రామాణికంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. షెడ్ల ఏర్పాటునకు సబ్సిడీతో రుణాలు ఇప్పిస్తాం. గుర్తింపు కార్డులు ఇచ్చి చంద్రన్న బీమా అమలు చేస్తాం. మెకానిక్​ల ఆదాయం పెంచి ఆదుకునేందుకు భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని మెకానిక్​లకు లోకేష్​ హామీనిచ్చారు.

చిన్నప్పుడు కాలేజీ ఎగ్గొట్టి బైక్​ పై సినిమాకు చెక్కేశా .. లోకేష్

చిన్నప్పుడు మీ మాదిరిగానే కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లి ఇంట్లో దొరికి పోయా. అమ్మతో దెబ్బలు తిన్నా. అప్పుడు అదో సరదా. నాకు ఓ మెకానిక్​ ఫ్రెండున్నాడు. బైక్​ ఇంజను తీసుకెళ్లి ఓ కారు తయారు చేశా. మేమిద్దరం అందులో తిరిగే వాళ్లం. ఇప్పటికీ ఆ కారును పదిలంగా దాచుకున్నా.

Advertisement

Next Story