Cm Jagan: వాళ్లు చాలా గొప్పవాళ్లు.. అందుకే సెల్యూట్ చేస్తున్నా

by srinivas |   ( Updated:2023-04-12 15:02:17.0  )
Cm Jagan: వాళ్లు చాలా గొప్పవాళ్లు.. అందుకే సెల్యూట్ చేస్తున్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘పేదరికానికి కులం, మతం ఉండదు. ఈ ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు. ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు. ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం. మహిళలకు 50 శాతం. రిజర్వేషన్‌పై చట్టం చేశాం. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల‌న్నదే నా తాపత్రయం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకంలో భాగంగా దాదాపు 4.39 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.658.60 కోట్లు జమ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

నిధులు జమ చేసే ముందు సీఎం జగన్ సభలో ప్రసంగించారు. ‘ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ఏ జిల్లాను తీసుకున్నా… గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా?’ అని సీఎం జగన్ ఛాలెంజ్ చేశారు. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి.. నిజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అబద్ధాల బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ‘గత ఐదేళ్ల హయాంలో ఇక్క ఇళ్ల స్థలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారు. మనం ఇచ్చిన 30 లక్షల ఇళ్లపట్టాల విషయాన్ని చెప్పండి. అలాంటి ఇళ్లస్థలాలముందు సెల్ఫీ దిగే నైతికత ఉందా?. ’ అని ప్రశ్నించండి అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

సెల్యూట్ చేస్తున్నా

‘ఇంటింటి దీపాలైన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మల చరిత్రలు కూడా అంతే గొప్పవి. ఆ అక్కా చెల్లెమ్మల నిత్యజీవితాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ..వాళ్ల జీవితాలనే కాకుండా ఆ కుటుంబాలను నడిపించే బాధ్యతలను అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో చేస్తున్నారు. ప్రతి అక్కచెల్లెమ్మకు మీ జగన్‌ సెల్యూట్‌ చేస్తున్నాడు’ అని సీఎం వైఎస్ జగన్ మార్కాపురం సభలో అన్నారు. తల్లి గర్భంలో ఉన్న శిశువుల నుంచి 60 ఏళ్ల అవ్వల వరకు అందరికీ కూడా మంచి చేస్తూ అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సంపూర్ణ పోషణతో మొదలు వృద్ధాప్య పింఛన్‌ వరకు అన్ని విధాల అక్కచెల్లెమ్మలకు మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అక్కచెల్లెమ్మలకు చేతిలో రూపాయి డబ్బు పెడితే..ప్రతి రూపాయి కూడా అక్కచెల్లెమ్మ తమ కుటుంబం బాగోగుల కోసం ఖర్చు చేస్తుందని నమ్మి ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అంతేకాదు కాపు నేస్తం పేరుతో కాపు అక్కచెల్లెమ్మలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడే విధంగా మంచి చేస్తూ కాపు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ వెల్లడించారు. పేదరికంలో ప్రతి ఒక్కరికి తోడుగా నిలవాలని చెప్పి..ఓసీ వర్గంలోని పేద మహిళలకు తోడుగా ఉండేందుకు వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ వెల్లడించారు. 45 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్యులు, క్షత్రియులు, వెలమలు, బ్రహ్మణులు ఇలాంటి తదితర అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మలకు మేలు జరిగించేందుకు ఈబీసీ నేస్తానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ రెండు సంవత్సరాల కాలంలోనే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు అక్షరాల రూ.1250 కోట్లు వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయడం లేదని సీఎం జగన్ తెలిపారు. ‘నా అక్కచెల్లెమ్మలు అందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలని, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడాలని, రాజకీయంగా నా అక్కచెల్లెమ్మలు పైకి రావాలని, సామాజికంగా, విద్యాపరంగా సాధికారతను సాధించాలని, వారి ఆత్మ గౌరవం పెంచేందుకు ఈ నాలుగేళ్లలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.’అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వంగా ఈ 46 నెలల కాలంలోనే ఇప్పటికే రూ.2.07 లక్షల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా పేదవాళ్ల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయిని సీఎం జగన్ సభలో వెల్లడించారు.

ఫేక్ ఫోటోలతో సెల్ఫీ ఛాలెంజ్‌లు

ఫేక్ ఫోటోలతో సెల్ఫీ ఛాలెంజ్‌లు అంటూ చంద్రబాబు మోసాలు మొదలు పెట్టాడని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్తాడు. మీ బిడ్డ హయాంలో పూర్తిగా కట్టి వేగంగా నిర్మిస్తున్నారు. ఆ ఇళ్ల వద్దకు వెళ్లి ముసలాయన ఫోటోలో దిగుతారు. సెల్ఫీ చాలెంజ్‌ అంటున్నాడు. అయ్యా బాబుగారు..సెల్ఫీ చాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు. ఈ రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ..ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగిందని అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు.’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘గత పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేని చంద్రబాబుకు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల ఇంటి స్థలాలు, అందులో కడుతున్న ఇళ్ల ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్‌ అంటించే అర్హత చంద్రబాబుకు ఉందా.’ అని ప్రశ్నించాలని సీఎం జగన్ సూచించారు. చంద్రబాబు..ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్‌ వేస్తావని నిలదీయాలని పిలుపునిచ్చారు. ‘మా ప్రభుత్వంలో 45 లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది. మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్‌ అంటించే అర్హత మీకు ఉందా బాబు అని ప్రశ్నించండి.’ అని సూచించారు. ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని పచ్చి మోసం చేశాడు. సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టాడు. ఇలాంటి మోసాలు చేసిన చంద్రబాబును అడగండి. మా ఇంటి వద్దకు వచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత, మా ఇంటికి స్టిక్కర్‌ అంటించే అర్హత ఉందాజ’ అని నిలదీయండని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వండి

మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని అయితే ఆ ఎన్నికల్లో గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని టీడీపీ మేనిఫెస్టో..వైసీపీ మేనిఫెస్టోను బేరీజు వేసుకుని ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తే.. తాను మాత్రం మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతి హామీని నెరవేర్చినట్లు సీఎం జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో అనేక డ్రామాలు చూస్తామని.. అబద్ధాలు వింటామని సీఎం జగన్ తెలిపారు. ‘చంద్రబాబుకు తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నాడని, మీ బిడ్డ వీళ్ల మాదిరిగా గజ దొంగల ముఠాను నమ్ముకోలేదు. వీళ్ల మాదిరిగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం మీ బిడ్డ పాలనలో లేదు’ అని చెప్పారు. ‘మీ బిడ్డ నమ్ముకున్నది ఆ దేవుడి దయను, మిమ్మల్నే నమ్ముకున్నాడు. అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావాలి. మీ జగన్‌ నమ్ముకున్నది మిమ్మల్నే. దేవుడి దయతో మీకు ఇంకా మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి.’ అని కోరుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ సభలో ప్రసంగాన్ని ముగించారు.

Also Read..

Nationwide: అన్ని నివేదికల్లోనూ జగన్‌దే టాప్ ప్లేస్!

Advertisement

Next Story