వాళ్లకు ఒక్కమాట కూడా చెప్పకుండా చిరంజీవి పార్టీని అమ్మేశాడు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
వాళ్లకు ఒక్కమాట కూడా చెప్పకుండా చిరంజీవి పార్టీని అమ్మేశాడు.. పోసాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పోసాని మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. వాలంటీర్లు, మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు. గతంలోనూ చంద్రబాబు, లోకేష్‌పై పవన్ విమర్శలు చేశారు.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబును సీఎం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. కాపుల్లో ఎవరూ సీఎంగా పనికిరారు అని తేల్చేసి.. చంద్రబాబును గద్దె ఎక్కించడానికి పూనుకున్నారని సీరియస్ అయ్యారు.

కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజికవర్గ నేతలంతా ఆనందించారు.. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అయినా సంతృప్తి పడకుండా కాపులకు ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజల కోసం పార్టీ పెట్టాడు.. మెగా ఫ్యామిలీ పైసల కోసం పార్టీలు పెట్టింది.. ఇదే జగన్‌కు పవన్ కల్యాణ్, చిరంజీవికి ఉన్న తేడా అని పోసాని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story