ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వైద్యం

by Anjali |
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వైద్యం
X

దిశ, ఏలూరు బ్యూరో: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైరల్ ఫీవర్‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులతో మొదలై మలేరియా,టైఫాయిడ్ ఇతర వ్యాధులకు దారి తీస్తున్నాయి. జిల్లాల్లోని మన్యం ప్రాంతంలో వైద్యం పడకేసింది. మారుమూల గిరిజన పల్లెల్లో వైద్యాధికారులు చొరవ లేక ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైద్య శిబిరాలు క్షేత్ర స్థాయిలో ఫలితం చూపడం లేదని మన్యంవాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో రోగుల తాకిడి పెరుగుతోంది. నమోదవుతున్న మలేరియా కేసుల్లో అధికంగా మన్యం ప్రాంతవాసులే ఉంటున్నారు. ఏలూరు, భీమవరం పట్టణాలతో పాటు జీలుగుమిల్లి,బట్టాయిగుడేం, కొయ్యలగూడెం పోలవరం కుక్కునూరు, వేలేరుపాడు, మండలాల్లో జ్వర పీడితులు సంఖ్య ఎక్కువగా ఉంది. ఏలూరు జిల్లా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు 3172 కేసులు నమోదు కాగా, అందులో సుమారు 1300 పైగా కేసులు వైరల్ ఫీవర్ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు 900కు పైగా వైరల్ ఫీవర్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు ఆసుపత్రికి వెళ్లడానికి నిర్లక్ష్యం చేస్తూ స్థానికంగా ఉన్న మెడికల్ షాపులలో ప్రెస్క్రిప్షన్ లేని మందులు వాడుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించి జ్వరపీడుతులను గుర్తించి సరైన వైద్యం అందిస్తే జ్వరాలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పడకేసిన పారిశుధ్యం

పట్టణాల నుంచి పల్లెల్లో వరకు పారిశుధ్యం పడకేసింది. అధికారుల శానిటేషన్ నిర్వహణ ఫోటోలకు పరిమితమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వర్షాలు కురిసిన నాటి నుంచి నేటి వరకు ప్రతి చోట మురికి గుంతలు దర్శనమిస్తున్నాయి. పన్నుల వసూళ్లపై పెట్టిన శ్రద్ధ పారిశుధ్యం మెరుగుపై లేదని ప్రజలు మండిపడుతున్నారు. పలు గ్రామాల్లో అయితే మంచినీటి లీకేజీలను కూడా పట్టించుకోవడం లేదు. వృధా అవుతున్న నీరు నిల్వ ఉండి మురికి గుంతలుగా ఏర్పడుతున్నాయి. వీటి వల్ల దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది.

ప్రైవేట్ ఆస్పత్రులకెళితేనే నయం..

జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే కొందరి సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని కమీషన్లకు అలవాటు పడుతున్నారని చర్చ నడుస్తోంది. చిన్న సమస్యలను పెద్దదిగా చూపుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సామాన్యులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిపోతోంది. వైరల్ ఫీవర్స్ కొన్ని రోజుల నుంచి డేంజర్ బెల్స్ మోగిస్తుంటే వైద్యులు సైతం సాకులు చెబుతూ ప్రైవేట్ ల్యాబ్ లకు తరలించి ప్రజల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతుల్లేవని కారణంగా చెబుతున్నారని కొందరు రోగులు అంటున్నారు.

జిల్లాలో జ్వర పీడతలు సంఖ్య ఇదే..

ఈ ఏడాది జనవరి మొదలుకొని ఇప్పటివరకు సుమారు 26,395 కేసులు నమోదు కాగా పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు 1223 టైఫాయిడ్, 31 మలేరియా, 55 డయేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎంతో విలువైన పరీక్షా సమయం. కొందరు జ్వరాలతోనే పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లా కేంద్రం ఏలూరులో 1,040 జ్వరపీడితులు నిర్ధారణ అవడంతో ఆందోళన కలగజేస్తోంది. జంగారెడ్డిగూడెం పరిధిలో 790, పెదవేగిలో 1226, భీమడోలు 1225, పెదపాడులో 877, కోరుకొల్లు 677, దెందులూరు లో 742 పోతునూరులో 622, వైరల్ ఫీవర్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. పోలవరం పరిధిలో 428, నూజివీడులో 412, వేలేరుపాడులో 469, కేఆర్‌పురం‌లో 402, దొరమామిడి‌లో 449, ఈపీఆర్ గూడెంలో 543 జ్వర బాధితులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు సుమారు 25 మండలాల్లో వంద నుంచి 300 కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story