Andhra Pradesh : ఏపీలో మళ్లీ జగనే.. ప్రతిపక్షాలే వైసీపీకి శ్రీరామరక్ష.!

by Satheesh |   ( Updated:2023-08-14 05:29:27.0  )
Andhra Pradesh : ఏపీలో మళ్లీ జగనే.. ప్రతిపక్షాలే వైసీపీకి శ్రీరామరక్ష.!
X

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మూడ్​ ఆఫ్​ ది నేషన్.. ఇలా రకరకాల పేర్లతో అనేక సర్వేలు బయటకు వస్తున్నాయి. వీటన్నింటి సారాంశం ఒక్కటే. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే. పాలనలో వైసీపీ తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజల సానుకూలతకు కొంత దోహదపడుతున్నాయి. పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు మరో మెట్టు ఎక్కించింది.

ఇంతకన్నా మెరుగ్గా వివిధ రంగాల్లో అభివృద్ధి ఎలా సాధించవచ్చో చెప్పలేని దౌర్భాగ్యంలో ప్రతిపక్షాలు ఉండడం అధికార పార్టీకి వరమైంది. కేవలం ఉక్రోషపు దుర్భాషలు, వ్యక్తిత్వ హననాలతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి వైసీపీ మరింత ఆజ్యం పోస్తోంది. విపక్షాలు ఇలాగే ఉండాలని అధికార పార్టీ కోరుకుంటోందని దీన్నిబట్టి అర్థమవుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో విద్వేష రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన పార్టీలు.. అవినీతి, శాంతి భద్రతల అంశాలపైనే గురి పెడుతున్నాయి. సీఎం జగన్​తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తెగ దోపిడీ చేస్తున్నారంటూ ఈ రెండు పార్టీల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

మీరు పత్తిత్తులా అంటూ వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. బహిరంగ సభలు, ప్రెస్​మీట్లు, మీడియా చర్చా వేదికలపై వ్యక్తిత్వ హననాలు, పరస్పర దుర్భాషలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. గెలుపోటములను ప్రభావితం చేసే తటస్తులు సైతం ఇవేం రాజకీయాలంటూ ఈసడించుకుంటున్నారు.

సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే..

ప్రజలు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించాలని అధికార పార్టీ కోరుకుంటోంది. అందుకు తగ్గట్లుగా ప్రజల్లో కులతత్వానికి మరింత ఆజ్యం పోస్తోంది. వ్యక్తిత్వ హననాలు, దుర్భాషలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అదే సమయంలో తాము ఇప్పటిదాకా అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రచారంపైనే ఎక్కువగా కేంద్రీకరిస్తోంది.

వైసీపీ ట్రాప్‌లో విపక్షాలు చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన ఉక్రోషం టీడీపీ నేతలను ఇంకా వీడలేదు. వైసీపీకి తామే ప్రతిపక్షమనే ప్రచారం కోసం జనసేనాని పొంతన లేని వ్యాఖ్యలతో జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.

చంద్రబాబు గెలిచింది అందుకే..

సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు అవినీతి అక్రమాలపై పరస్పరం పుస్తకాలు విడుదల చేసుకున్నారు. అవేమీ అంతగా ప్రజలను ప్రభావితం చేయలేదు. గతం కన్నా కొత్తగా ఏం చేస్తామని మేనిఫెస్టో ప్రకటిస్తారో వాళ్లనే జనం ఆదరించారు. 2014లో అనుభవజ్ఞుడు.. విభజిత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే కోణంలో ప్రజలు చంద్రబాబుకు జై కొట్టారు.

జనాన్ని ఆకర్షించిన జగన్ హామీలు..

టీడీపీ పాలనకు భిన్నంగా వైఎస్ జగన్​ఇచ్చిన హామీలు జనం ఆలోచనలను మార్చేశాయి. ఇప్పుడు వైసీపీ సర్కారుకు ప్రత్యామ్నాయంగా రంగాల వారీ ఉపాధితో కూడిన అభివృద్ధికి ఎలా బాటలు వేస్తారనేది విపక్షాలు చెబితే మరోసారి ప్రజల ఆమోదం పొందవచ్చు. ఇవన్నీ వదిలేసి వ్యక్తిగత పరస్పర దూషణలతో రెచ్చిపోతే మళ్లీ సీఎం జగనేనంటున్న సర్వేలు వాస్తవం రూపం దాల్చవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed