బీటెక్ రవిని కిడ్నాప్ చేశారో.. అరెస్ట్ చేశారో తెలియని దుస్థితి: టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్

by Seetharam |   ( Updated:2023-11-15 06:03:34.0  )
బీటెక్ రవిని కిడ్నాప్ చేశారో.. అరెస్ట్ చేశారో తెలియని దుస్థితి: టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అరెస్ట్ అక్రమమని మండిపడ్డారు. జగన్ రెడ్డికి ఓటమి భయం వెంటాడుతోంది అని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ బలపడుతుండటం.. తనపై ప్రజా వ్యతిరేకత పెరగడంను ఓర్వలేకపోతున్నారు అని ధ్వజమెత్తారు. సొంత నియోజక వర్గం పులివెందులలో బిటెక్ రవి చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. అరెస్ట్ చేస్తున్నారో... కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి వచ్చిందన్నారు. వచ్చింది పోలీసులో... కిడ్నాపర్లో తేల్చుకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేశారా...కిడ్నాప్ చేశారా తెలీక బీటెక్ రవి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఎస్పీ, డీఎస్పీ లకు ఫోన్‌లు చేస్తే స్పందన కరువైందన్నారు. బీటెక్ రవి పై 10 నెలల కిందట నమోదు అయిన బెయిలబుల్ కేసు నాన్ బెయిలబుల్ కేసుగా మారడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు బహిరంగపరచాలి అని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవడం... ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం, వాటిని నాన్ బెయిలబుల్ కేసులుగా మార్చి అరెస్ట్ చేయడం పోలీసులకు సర్వ సాధారణం అయిపోయింది అని విరుచుకుపడ్డారు. బీటెక్ రవిపై అక్రమంగా పోలీసులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర డిమాండ్ చేశారు.

Advertisement

Next Story