AP Rains:ముంచెత్తిన వర్షం.. కడపలో గడప దాటని జనం

by Jakkula Mamatha |
AP Rains:ముంచెత్తిన వర్షం.. కడపలో గడప దాటని జనం
X

దిశ ప్రతినిధి,కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సంభవించిన తుఫాన్‌తో ఉమ్మడి కడప జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముంచెత్తుతోంది. ముసురు బట్టి కురుస్తున్న జడివానకు జనం గడప దాటని పరిస్థితి ఏర్పడింది. అత్యవసరాలతో బయటికి వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్నా, కుందూ, పాపాఘ్ని నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి.

స్తంభించిన రాకపోకలు..

జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం బుసిరెడ్డిపల్లెలో బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వంక బ్రిడ్జి తెగిపోవడంతో బుసిరెడ్డిపల్లి నుంచి వీరపునాయునిపల్లెకు రావాలన్నా, వేంపల్లె మండలం రామిరెడ్డి పల్లె నుంచి పల్లెల మీదుగా 20 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. జి.ఎన్.ఎస్.ఎస్ కాలువ నీటితో పాటు వర్షపు నీరు చేరడంతో వంక బ్రిడ్జికి నష్టం జరిగినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. పెద్దముడియం మండలంలో కుందూనది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నెమళ్లదిన్నె బ్రిడ్జి పై నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నా నదికి భారీగా వరద నీరు చేరుతుంది. మైలవరం రిజర్వాయర్ నుంచి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. దీంతో పెన్నా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

భారీ వర్షాలు..

ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనగలూరులో 81.2 ఎం.ఎం, నందలూరులో 71.6 ఎం.ఎం, చిట్వేలి 70.8, రాజంపేట, 51.2, పుల్లంపేట 70.2 ఎం.ఎం, ఓబులవారిపల్లె 58.4 ఎం.ఎం, కోడూరులో 79.0 ఎం.ఎం వర్షపాతం నమోదయ్యాయి. అలాగే పోరుమామిళ్లలో 90.4 ఎం.ఎం, పెద్దముడియంలో 51.6 ఎం.ఎం, కడపలో 40.0 ఎం.ఎం, చింతకొమ్మదిన్నె లో 45.8 ఎం.ఎం, శ్రీ అవధూత కాశీనాయనలో 65.8 ఎం.ఎం వర్షపాతం నమోదయ్యాయి.

కలెక్టర్ పర్యవేక్షణ..

జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లాలోని పలు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో వర్షాల పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాతావరణశాఖ అధికారులు అన్నమయ్య, కడప జిల్లాలను రెడ్ అలర్ట్ ప్రకటించారు.

కడప నగరంలో పలు ప్రాంతాలు జలమయం..

కడప నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తుండడంతో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నాయి. కడప నగరంలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ ఆవరణం చెరువులా తలపిస్తోంది. అశోక్ నగర్, మృత్యుంజయ కుంట, అప్సర నుండి వై జంక్షన్ సర్కిల్, గురుకుల విద్యాపీఠ్, ఆర్టీసీ బస్టాండ్, ఏడు రోడ్లు, రవీంద్ర నగర్, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్ లో భాగంగా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది తో కలసి తక్షణ చర్యలు చేపట్టారు. గల్ఫర్ మిషన్ సహాయంతో నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. కడప కోర్టు వద్ద నుంచి ఆర్టీసీ సర్కిల్ వరకు ఉన్న నీటిని తొలగించారు.

Advertisement

Next Story