తిరుమల విశిష్టత గురించి మీరు మాట్లాడడం మా ఖర్మ.. జగన్‌పై పయ్యావుల ఫైర్

by karthikeya |   ( Updated:2024-10-04 12:04:00.0  )
తిరుమల విశిష్టత గురించి మీరు మాట్లాడడం మా ఖర్మ.. జగన్‌పై పయ్యావుల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల విశిష్టత గురించి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, అది ప్రజలు వినాల్సి రావడంత నిజంగా తమ ఖర్మ అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ రోజు (శుక్రవారం) ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో మట్లాడిన ఆయన.. జగన్ ఎంత చెప్పినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, పులివెందుల ఎమ్మెల్యే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా డిక్లరేషన్ ఇవ్వకుండా గుడికి వెళ్లొచ్చిన వ్యక్తి జగన్ అని, ఇప్పుడు సంతకం పెట్టమన్నందుకు తిరుమల పర్యటనే రద్దు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని తాను నమ్ముతున్నాననే మాట జగన్ నోటి చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ అలా ఒప్పుకుంటే అదే తిరుమలేశుడికి గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని ఆయన గౌరవించినట్లు భావిస్తామన్నారు. తిరుపతిలో అద్భుతమైన వ్యవస్థను మీరు కాపాడామంటున్నారని, కానీ నిజానికి ఆ వ్యవస్థను చెడగొట్టారు కాబట్టే కల్తీ నెయ్యి కొండపైకి వచ్చిందని విమర్శించారు. టెండర్ల అర్హతను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను సైతం జగన్ వక్రీకరించారని, కోర్టు ఆర్డర్ రాకముందే మీడియా సమావేశం పెట్టి ప్రజల్ని భ్రమలోకి నెట్టే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు.

‘‘సిట్ అధికారులకు మంచి రెప్యూటేషన్ ఉందని సుప్రీం కోర్టు స్వయంగా చెప్పింది. సిట్ అధికారులపై తమకు ఎలాంటి అనుమానాలూ లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విచారణకైనా సహకరిస్తామని కోర్టుకు తెలిపింది. త్వరలోనే సిట్ విచారణ ప్రారంభం అవుతుంది. విచారణలో పూర్తి పారదర్శకత పాటిస్తాం. ప్రక్షాళన జరగాలి, నిజాలు బయటకు రావాలనే మా ప్రభుత్వం కోరుకుంటోంది. అలాగే దోషులు ఎవరనేది విచారణలో తేలుతుంది’’ అని అన్నారు.

అయితే జగన్ మాత్రం సుప్రీం కోర్టు రాతపూర్వక తీర్పును సైతం వక్రీకరించి.. నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్నారని పయ్యావుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలకు కోర్టు వేదిక కాదని ధర్మాసనం చెబితే.. దాన్ని వక్రీకరించి ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పు బట్టినట్లు ప్రజలకు నమ్మకబలికే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ని చూస్తుంటే నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొచ్చి ఉంటుందనే సామెత జగన్‌ లాంటి వాళ్ల గురించే పుట్టిందనిపిస్తోందని అన్నారు. తిరుమల సెట్టింగ్ వేసుకున్న జగన్ వేంకటేశ్వరుని ప్రాశస్త్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, గంటన్నర ప్రెస్‌మీట్‌లో కనీసం స్వతంత్ర సిట్‌పై తమకు నమ్మకం ఉందని కానీ, ఈ విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని కానీ జగన్ చెప్పలేదని మండిపడ్డారు.

Advertisement

Next Story