చంద్రబాబుకు అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవు : మంత్రి అంబటి రాంబాబు

by Seetharam |
చంద్రబాబుకు అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవు : మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అసలు పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడని ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసనని కానీ పవన్ కల్యాణ్ అభిమానులకే తెలియడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ అభిమానులకు, మా కులపు వాళ్లకు ఒకటే చెబుతున్నా.. పవన్‌కు రాజకీయాలు తెలియవని అన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయాడని మరోసారి మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘మా లీడర్ ముఖ్యమంత్రి కావాలి, మా కులపోడు ముఖ్యమంత్రి కావాలని మీరు ఆశపడుతున్నారు. అది మంచిదే కానీ పవన్ కల్యాణ్ నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని స్వయంగా చెప్తున్నారు. ఇప్పటికైనా మా కులంవాళ్లు, పవన్ కల్యాణ్ అభిమానులు వినిపించుకోకపోతే ఎలా?’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చేసే రాజకీయం కేవలం టీడీపీ కోసమేనని అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ కోసం ఎంత రాజకీయం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

ముసుగేసుకువచ్చినా వైసీపీదే విజయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను, వైసీపీని ఓడించడం ఎవరి వల్ల కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన కలిసి వచ్చినా, మరో ఇద్దరితో కలిసి వచ్చినా వైసీపీపై ఎలాంటి ప్రభావం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నేత కూడా సాహసించని సవాల్‌ను జగన్ ప్రతిపక్షాలకు విసురుతున్నారని అన్నారు.‘ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మీ ఇంట్లో వారికి లబ్ది కలిగితేనే మాకు ఓటేయండి, లేదంటే వేయొద్దు’ అంటూ ఓటర్లకు సీఎం జగన్ చెప్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలా పద్నాలుగేళ్ల అధికారంలో ఉన్న టీడీపీ ఇలా చెప్పి ప్రజలను ఓట్లు అడగ గలదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా...ముసుగేసుకుని వచ్చినా గెలిచేది.. మళ్లీ సీఎం పీఠంపై కూర్చునేది వైఎస్ జగన్ అని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed