Pavan Kalyan: పవన్‌ను కదిలించిన మహిళల అర్జీ..! తక్షణ చర్యలకు ఆదేశం

by Ramesh Goud |   ( Updated:2024-07-27 11:04:44.0  )
Pavan Kalyan: పవన్‌ను కదిలించిన మహిళల అర్జీ..! తక్షణ చర్యలకు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలు, వృద్దులు పంపిన ఓ ఫిర్యాదుపై స్పందించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తన కార్యాలయానికి వచ్చిన అర్జీలను పరిశీలించారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతోపాటు, సమస్య తీవ్రతనుబట్టి అధికారులతో మాట్లాడారు.

ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా నుంచి మహిళలు, వృద్దులు పంపించిన సమస్య పవన్ కళ్యాణ్ కదిలించింది. ఇందులో తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ లో కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి బైక్స్ పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తున్నారని తెలిపారు. అంతేగాక విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు.

ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే హైవేకు వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు. వీరు వేదింపులకు గురైన వారిలో ఓ మహిళా ఎస్సై కూడా ఉందని తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్‌పి సుబ్బారాయుడుకు ఫోన్ చేశారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.

Advertisement

Next Story