Pawan Kalyan: జగన్ ప్యాలెస్‌లపై పెట్టిన దృష్టి.. ప్రజలపై పెట్టలేదు

by Shiva |   ( Updated:2024-10-21 10:55:38.0  )
Pawan Kalyan: జగన్ ప్యాలెస్‌లపై పెట్టిన దృష్టి.. ప్రజలపై పెట్టలేదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ ప్యాలెస్‌లపై పెట్టిన దృష్టి.. ప్రజలపై పెట్టలేదని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల పరిధిలో గల ఎస్ఎస్ఆర్ పేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయేరియాకు గల కారణాలు, వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.500 కోట్ల ప్రజాధనంతో రుషికొండలో విలాసవంతమైన భవనాలు కట్టారని.. మారుమూల గ్రామాల్లో మంచినీటి సరఫరాను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

ముఖ్యంగా 15 ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా పక్కదారి పట్టించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. నిధుల విషయంలో గ్రామం పంచాయతీలకు నిధులను విడుదల చేసిన పాపాన పోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాయని పేర్కొ్న్నారు. ప్రజలకు సాయం చేసే విషయంలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. జగన్ తన ప్యాలస్‌లపై పెట్టిన దృష్టి కూడా ప్రజలపై పెట్టలేదని ఆక్షేపించారు.

Advertisement

Next Story