కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత..!!

by GSrikanth |   ( Updated:2022-10-21 13:23:36.0  )
కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత..!!
X

దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పనిచేస్తున్నాయి. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ శతథా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం జనసేనతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగడం దాదాపుగా ఖరారవుతున్నట్లుగానే ఉంది. అధికారం దక్కించుకోలేకపోతే తర్వాత పరిస్థితి ఏమిటనేది ఇరువైపులా నేతలు అవగాహనతోనే ఉన్నారు. దీంతో ఎవరికి వారుగా వ్యూహాలు పన్నుతున్నారు. అయితే అనూహ్యంగా అందరికీ షాక్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఒక్కసారిగా ఏపీలో రాజకీయాన్ని మార్చేశారు ఆయన. నిన్న మొన్నటి వరకూ లైట్ తీసుకున్న రాజకీయ పార్టీలు..అది మిత్రులైనా..ప్రత్యర్థులైనా...అందరికీ పవన్ లో కనిపిస్తున్న మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అనే చెప్పాలి. ఇంతవరకూ ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అన్నట్టు ఆయన అడుగులు వేస్తున్నారు అంటున్నారు జనసేన శ్రేణులు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేయడంవల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని స్థాయిలో లాభపడింది. ఈ విషయాన్ని గమనించిన జనసేనాని రానున్న ఎన్నికల్లో పొత్తుకైనా సిద్ధమేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం చీలనివ్వనని పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. గత వారం రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా, ఆపై విజయవాడ వేదికగా పవన్ కల్యాణ్ టార్గెట్‌గా జరిగిన పరిణామాలు ఆ దిశగానే రాజకీయాలను మలుపు తిప్పాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా పవన్‌ను కలిసి సంఘీభావం తెలియజేయడం లాంటి సంఘటనలు ఆయన‌కు పవన్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడి తోడు కావల్సిన అవసరాన్ని తెలియజెప్పాయి.

పొత్తు ఖాయమే..

2019లో ఓట్లు చీలిపోవడంవల్లే నష్టపోయామనే అవగాహనతో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీచేయడం దాదాపు ఖాయమైంది. అధికారిక ప్రకటనే బాకీ. విశాఖ సంఘటన జరగనంతవరకు, అంతకు కొద్దిరోజుల క్రితం వరకు పవన్ ఒంటరిగానే పోటీచేయడానికే మొగ్గుచూపారు. అయితే పార్టీ తరఫున ఏ కార్యక్రమం తలపెట్టినా, తాను ఎక్కడికి వెళ్లినా వైసీపీ నేతలు అడ్డుకోవడంతోపాటు కార్యక్రమాల నిర్వహణకు కూడా అడ్డంకులేర్పడుతున్నాయన్న భావనలో పవన్ ఉన్నారు. దీంతో గతంలో ఒంటరిగా పోటీచేయాలనుకున్నప్పటికీ తనకు బలమైన రాజకీయ పార్టీ అండగా ఉండాలని పవన్ భావించారు. అయితే..ఇక్కడే పవన్ వ్యూహం కనపడింది. గతంలోలా తానే ముందుకు వెళ్లి సహకారాన్ని అందించకుండా.. చంద్రబాబే తన వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించేలా చేశారు. ఇది ఏపీ రాజకీయ విశ్లేషకులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం ఆవేశ పరుడైన నేత గానే పవన్ కల్యాణ్ ను ఇంతవరకూ చూసిన ఇతర పార్టీలు ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటా? అని గమనిస్తున్నాయి.

ఆచి తూచి వ్యూహాలు వేస్తున్న పవన్

ఏపీలో నెలకొన్న పరిణామాలను అనుకూలంగా మార్చుకున్న పవన్ అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లోను వైసీపీ బలంగా ఉండటంతో ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా అడ్డంకులు తప్పవనే అభిప్రాయానికి పవన్ వచ్చారు. జెండా మోయాలన్నా, గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నా, అందులోను ముఖ్యంగా తాను అసెంబ్లీలో ఉండాలన్నా, బలమైన మిత్రపక్షం అవసరాన్ని పవన్ గుర్తించారు. బీజేపీతో స్నేహం ఉన్నప్పటికీ తాను మొదటి నుంచి అధికార పార్టీపై చేస్తున్న పోరాటంలో ఆ పార్టీ నేతలెవరూ కలిసి రాకపోవడం, రోడ్ మ్యాప్ ఇస్తానన్న ఢిల్లీ పెద్దలు అలసత్వం ప్రదర్శించడంలాంటివన్నీ పవన్‌ను పునరాలోచనలో పడేశాయి. దీంతో అందివచ్చిన పరిణామాలను అనుకూలంగా మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణుల్లో ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసుకున్నారు. దాని ప్రభావం చంద్రబాబు పల్నాడు టూర్‌లో కనిపించింది. టీడీపీ జెండాలు, జనసేన జెండాలు కలిసికట్టుగా ఎగరడంతో 2024 ఎన్నికల చిత్రం ఏంటో అందరికీ అర్థమైంది.

బీజేపీలోనూ పవన్ కేంద్రంగా ఏర్పడ్డ కల్లోలం

వైసీపీని గద్దె దించడం కోసం జరిపే ఉమ్మడి పోరు దిశగా వ్యూహరచన చేస్తున్న పవన్ కల్యాణ్.. ఈ పోరులో కలిసొచ్చే టీడీపీ, సీపీఐ వంటి పార్టీలతో జత కట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. అలాగే ఈ పోరులో కలిసొచ్చేందుకు సిద్ధపడితే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లేకపోతే మాత్రం బీజేపీని వదిలేసి మరీ ఇతర పార్టీలతో వైసీపీపై పోరుబాటకు రెడీ అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి డెడ్ లైన్ కూడా ఇచ్చేశారు. రోడ్ మ్యాప్ ఇస్తారా? లేక తమ దారి చూసుకోమంటారా? అంటూ పవన్ సంధిస్తున్న బాణం ఇప్పుడు కాషాయ సేనను డైరెక్ట్ గానే తాకుతోంది. దీంతో ఢిల్లీ పెద్దలు కూడా దృష్టిని ఏపీ రాజకీయాల వైవు మళ్లించాల్సి వచ్చింది. బీజేపీ కలిసి రాకపోతే మాత్రం బీజేపీని వదిలేసి మిగతా పార్టీలతో ముందుకెళ్లేందుకు పవన్ రెడీ అవుతున్నారు. అదే సమయంలో ఏపీలో తమతో పొత్తుకు సిద్ధంగా ఉన్న టీడీపీ.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అభ్యంతరాలు చెప్పకూడదనే భావనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఏపీలో వైసీపీ-బీజేపీయేతర పార్టీలతో జనసేన పొత్తు ఉంటే, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి జట్టు కట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఈక్వేషన్ పైనే ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా వర్కవుట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సీఎం జగన్ దృష్టి పవన్ పైనే

ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో సీఎం జగన్ దృష్టి కూడా పవన్‌పైనే కేంద్రీకృతమై ఉంది. కేవలం పవన్‌ను మాత్రమే తన ప్రధాన ప్రత్యర్థిగా ఆయన చూస్తున్నారు. గురువారం ఆయన ప్రసంగంలో అది స్పష్టంగా కనిపించింది. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన సీఎం స్పందించారు. దత్తపుత్రుడి దత్త తండ్రి ఏమని మాట్లాడిస్తున్నాడో చూశామని సీఎం వ్యాఖ్యానించారు. మూడు పెళ్లిళ్ల వలనే మేలు జరుగుతుందని.. మీరు చేసుకోండని చెబుతున్నారని పవన్‌పై సీఎం ఫైర్ అయ్యారు. మన ఆడవాళ్ల పరిస్థితి ఏంటి.. నాలుగు అయిదేళ్లు కాపురం చేసి విడాకులు ఇవ్వటం మొదలు పెడితే మీరు చేసుకోండని చెబుతూ పోతే..ఆడవారి జీవితాలు ఏం కావాలని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి వారు దశ- దిశ చూపగలరా? ఆలోచించాలని సీఎం సూచించారు. వెన్నుపోటు దారులంతా కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్దం చేస్తామంటున్నారని చెప్పారు. ఒక్క జగన్‌ను కొట్టటానికి ఇంత మంది ఏకం అవుతున్నారు. పెత్తందారులతో మరో 18 నెలల పాటు నిరంతరం పోరాటం జరుగుతుంది. మంచికి -మోసానికి జరుగుతున్న యుద్దం. పేదవాడికి -పచ్చ చొక్కాల పెత్తందారుకు మధ్య యుద్ధంగా అభివర్ణించారు. మంచి జరిగిన ప్రతీ ఇంటి నుంచి ప్రతీ ఒక్కరూ తనకు తోడుగా నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అయితే.. ప్రత్యర్థులు ఎవ్వరినీ లెక్క చేయని సీఎం జగన్ ఇలా మాట్లాడడం పవన్ సృష్టించిన అలజడి వల్లే అంటున్నారు విశ్లేషకులు.

నిలబెట్టుకుంటారా?

పవన్‌లో కనిపిస్తోన్న దూకుడు పట్ల జనసైనికుల్లో ఆనందం పెల్లుబుకుతోంది. తమ నాయకుడిగా పవన్‌లో తాము కోరుకుంది ఇదే అంటున్నారు వారు. రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ కల్యాణ్‌లో కనిపిస్తున్న కొత్త రాజకీయ నాయకుడిని ఆసక్తిగా చూస్తున్నారు. సడన్‌గా ఏపీ రాజకీయ సమీకరణాలను పవన్ మార్చేసిన మాట వాస్తవం. అయితే.. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఆయన ఎన్నికల ముంగిట వరకూ కొనసాగించగలిగితేనే ఈ వ్యూహాలు ఫలించినట్టు. మరి అంతవరకూ పవన్ ఇదే దూకుడు‌ను కొనసాగిస్తారా..? చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

1.Latest Updates from Pawan Kalyan's Hari Hara Veera మల్లు

రైతు సంక్షేమంకోసం జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed