పత్తాలేని పవన్ .. అధినేత తీరుతో క్యాడర్​లో స్తబ్దత

by samatah |   ( Updated:2023-07-17 14:48:32.0  )
పత్తాలేని పవన్ .. అధినేత తీరుతో క్యాడర్​లో స్తబ్దత
X

ప్యాకేజీ స్టార్, పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు ఎందుకు ఎద్దేవా చేస్తుంటారో ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా, అకాల వర్షాలతో రైతులు నిండా మునిగిపోయినా జనసేన నుంచి ఉలుకూ పలుకూ ఉండదు. సినిమా షూటింగులు లేనపుడు, తాను బాగా ఖాళీగా ఉన్నపుడు మాత్రమే పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తుంటారనేది సత్యదూరం కాదు. లేస్తే మనిషిని కాదు.. అనే స్థాయిలో ఆయన మాటలుంటాయి. లక్షలాదిమంది అభిమానులు పవన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం వారికోసమైనా క్రియాశీలకంగా మారాలి. లేదంటే, తమది ప్రశ్నించడానికి కాదు, మౌనంగా ఉండడానికే పుట్టిన పార్టీ అని ప్రకటించడం మంచిది.

దిశ, ఏపీ బ్యూరో : అకాల వర్షాలు కోస్తా జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. రైతులను ఇప్పటికే నిండా ముంచేశాయి. ఓ వైపు చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రశ్నించడానికేనంటూ పుట్టిన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ ఎక్కడంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షూటింగులు లేనప్పుడు మాత్రమే పార్టీ పని చూస్తారా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఛలోక్తులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు ఎక్కువగా టీవీ చర్చా వేదికలకే పరిమితమవుతున్నారు. కొద్దిమంది సోషల్​ మీడియాలో పోస్టులతో కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర ప్రజలు పీకల్లోతు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాటిపై జనసైనికులకు దిశా నిర్దేశం చేసి ప్రజలకు అండగా నిలవడంలో వైఫల్యం కనిపిస్తోంది. ఇలా పార్ట్​ టైమ్​ రాజకీయాలతో ఎన్నికలను జనసేన గట్టెక్కుతుందా అనే ఆందోళన ఆ పార్టీ సీనియర్​ నేతలను పట్టిపీడిస్తోంది. మరోవైపు పొత్తుల సంగతి తేలక నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం ఎలా ఉంటుందోనన్న బెంగ క్యాడర్​లో గుబులు రేకెత్తిస్తోంది.

రెండు పడవలపై కాళ్లు..

జనసేనాని పవన్​ కల్యాణ్​ ఓవైపు సినిమా షూటింగ్స్​ చేసుకుంటూ పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం తనకు ఈ ద్విపాత్రాభినయం తప్పదని గతంలో అనేక వేదికలపై పేర్కొన్నారు. ఈ మధ్యనే మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలు కూడా పూర్తయ్యాయి. ఇటీవలే నాగబాబుకు కీలక పదవి అప్పగించారు. రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడానికి సీనియర్​ నేత నాదెండ్ల మనోహర్​ ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా పార్టీ క్యాడర్​కు నిరంతరం దిశా నిర్దేశం చేయకపోవడం లోపంగా కనిపిస్తోంది. అసలు ఎన్నికలదాకా పార్టీ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారా లేదా అనేది ప్రశ్న తలెత్తుతోంది. జనసేన పార్టీ కార్యక్రమం ఇదీ అంటూ ఇప్పటిదాకా ఎక్కడా వెల్లడించిన దాఖలాల్లేవు.

రైతు రోదన విన్పించదా?

రాష్ట్ర ప్రజలు అనేక సమస్యల్లో కూరుకుపోయారు. ప్రధానంగా అకాల వర్షాలకు కోస్తా తీరంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంత్రులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఆచరణలో అన్నదాతలను ఆదుకుంటున్న దాఖలాల్లేవు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట చేతికొచ్చే దశలో వర్షాలకు దెబ్బతిని కన్నీటి పర్యంతమవుతున్నారు. నిరుద్యోగులు పొట్టచేతబట్టుకొని వలస పోతున్నారు. నిరంతరం పెరుగుతున్న కరెంటు చార్జీలు సగటు ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. అరకొర వేతనాలతో నెట్టుకొచ్చే అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో జీతాలు అందక అల్లాడుతున్నారు. సొంతింటి కల నెరవేర్చుకుందామని ఇంటి నిర్మాణం చేపట్టిన పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సకాలంలో బిల్లులు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు తెగబడి వెళ్లే జన సైనికులు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.

జనంలో కన్పించని జనసైనికులు..

రాష్ట్రంలో పొత్తులు ఓ కొలిక్కి రాలేదు. చంద్రబాబుతో పవన్ ఇటీవల భేటీ అయిన తర్వాత కూడా క్లారిటీ లేదు. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో అయోమయం నెలకొంది. అసలు పొత్తు ఉంటుందా ? ఉంటే ఎవరితో ఉంటుంది ? టీడీపీతో ఉంటేనే పోటీ చేయడానికి అత్యధికులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అదే బీజేపీతో అయితే పోటీ చేయడం అనవరమని పెదవి విరుస్తున్నారు.

వారాహి.. షెడ్డుకే పరిమితమా?

నియోజకవర్గ స్థాయి నేతలు ఇంతటి గందరగోళంలో పడితే ఇక క్యాడర్​కు నిర్దేశం చేసేది ఎవరనే ప్రశ్న ఉదయిస్తోంది. అందువల్లే జన సైనికులు జనంలో ఎక్కడా కనిపించడం లేదు. కొద్దిమంది నేతలు టీవీ చానెళ్ల చర్చా వేదికల్లో మెరుస్తున్నారు. యాక్టివ్​గా ఉండే కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ నెట్టుకొస్తున్నారు. వారాహి యాత్ర ఎప్పుడు మొదలవుతుందో.. మళ్లీ పవన్​ ఎప్పటి నుంచి ప్రజల్లోకి వస్తారో అనే విషయంపై అటు పార్టీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed