Pawan: భూమి మీద బాధ్యత లేకుండా జీవిస్తున్నాం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-10-09 07:33:50.0  )
Pawan: భూమి మీద బాధ్యత లేకుండా జీవిస్తున్నాం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదేళ్లలో కాలుష్యాన్ని తగ్గించాలనేదే మా ఆలోచన అని, పరిశ్రమల ఏర్పాటు, కాలుష్య నివారణలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పర్యావరణ పరిరక్షణకు నిపుణుల సలహాలు అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్ల కాలంలో ఎంత మేరకు పొల్యూషన్ తగ్గించగలము అనే దానిపై ఆలోచన చేస్తున్నామని, దాని గురించి సమగ్ర ప్రణాళికలు రూపొందిచాల్సి ఉందన్నారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యతో మూడు రోజుల క్రితం చర్చ జరిపామని, 72 గంటల్లోనే ఈ వర్క్ షాప్ నిర్వహించి, ఎన్జీవోలు సహా అన్ని రంగాల నిపుణులను ఆహ్వానించినందుకు అభినందనలు తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణకు నిపుణులు మేధావులు, ఎన్జీవోల సలహాలు ఎంతో ఉపయోగపడతాయని, దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై అందరికీ స్పష్టత వస్తుందన్నారు. అలాగే తాను ప్రకృతి ప్రేమికుడినని, ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తులలో తాను ఒకడినని, పర్యావరణం బాగుండాలని ప్రకృతి ప్రేమికులు ఎంత తపన పడతారో తనకు తెలుసన్నారు. చాలామంది భూమి మీద కనీస బాధ్యత లేకుండా జీవిస్తున్నారని, భూమిని మనం సొంతం చేసుకోలేము కానీ భూమి ఏదో ఒకనాటికి మనల్ని సొంతం చేసుకుంటుందని తెలిపారు. ఇక 974 కిలో మీటర్ల కోస్టల్ కారిడార్ ఉందని, దానిని అభివృద్ది చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ది జరగాలని, భవిష్యత్ తరాల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

ఇక జల, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం తీరు ఆందోళన కలిస్తుందని, కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షించడంలో ఇక్కడున్న వారు పాత్ర ధారులు కావాలని అన్నారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే ఇబ్బందులు పెడతారనే అపోహాలు పరిశ్రమల యజామాన్యాల్లో ఉన్నాయని, అందుకే పీసీబీ పాలకులు కాలుష్య నియంత్రణ గురించి పట్టించుకోవడం మానేశారని అన్నారు. ఈ అపోహలు తొలిగిపోయేలా అధికారులు పని చేయాలని సూచించారు. ఇక నుంచి పరిశ్రమల ఏర్పాటు, కాలుష్య నివారణ రెండింటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి పర్యావరణాన్ని రక్షించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed