ప్రకటించగానే అభ్యర్థులు కారు!

by Mahesh |   ( Updated:2024-03-17 07:28:04.0  )
ప్రకటించగానే అభ్యర్థులు కారు!
X

దిశ ప్రతినిధి, విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేదీ మే మాసంలో ఉండడం అభ్యర్థుల తలరాతలు మార్చనుంది. పోలింగ్ తేదీ నేటికి 56 రోజులు, నోటిఫికేషన్‌కు నెల రోజులు గడువు ఉండడంతో హడావుడిగా అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీలు ఊపిరి పీల్చుకొన్నాయి. ఆ నెల రోజుల పని తీరు, ప్రజలలో పనిచేసిన విధానం, ప్రజాభిప్రాయం ఆధారంగా అవసరమైతే అభ్యర్థులను మార్చుకొనే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలకు లభించింది.

అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి

రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు 90 శాతం అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థి మినహా 175 మంది ఎమ్మెల్యే, 24 ఎంపీ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఏంపీల మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. జనసేన అభ్యర్థుల దాదాపుగా ఖరారయ్యారు. జాతీయ పార్టీలైన బీజీపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ప్రకటించాల్సింది.

మార్పులకు అవకాశం

పలు వత్తిడులు, సిఫార్సులతో హడావుడిగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించిన పార్టీలు ఆ రెండు నెలల కాలంలో వారిని పరీక్షించనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కి ఇంకా నెల రోజుల సమయం వున్నందున మరో మారు క్షుణ్ణంగా సర్వేలు చేయించి అభ్యర్థి విజయావకాశాలను బేరీజు వేసుకొని అవసరమైన చోట మార్పు చేర్పులు చేసుకొనే అవకాశం పార్టీలకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీలు కల్పించాయి. పార్టీలు చర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులకు కూడా సమయం లభించినట్లైంది. పార్టీకి దూరమయ్యే వారిని పిలిచి మాట్లాడుకునే వీలు చిక్కింది. విజయావకాశాలనే గీటురాయిగా రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల విషయంలో వ్యవహరించనున్నాయి.

Read More..

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 180 సెలవులను ఎప్పుడైన వాడుకోవచ్చు

Advertisement

Next Story

Most Viewed