జిందాల్ జి జర దేకోజీ.. ఆ విషయంలో ఎస్పీకి తల్లిదండ్రుల విన్నపం

by Indraja |   ( Updated:2024-03-15 07:01:49.0  )
జిందాల్ జి జర దేకోజీ..  ఆ విషయంలో ఎస్పీకి తల్లిదండ్రుల విన్నపం
X

దిశ, బాపట్ల ప్రతినిధి: బాపట్ల ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది సూర్యలంక బీచ్. అలానే దేశంలోనే మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ కాలేజ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇక్కడే నిర్మించారు. ఇక ఉమెన్స్ డిగ్రీ కళాశాలు, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా ఎన్నో విద్యాసంస్థలతో ఎడ్యుకేషనల్ హబ్ గా పేరుగాంచింది. అయితే ఇదంతా ఒకప్పుడు.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఒకప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటను నిజంచేస్తూ ఎందరో మేధావులను తయారుచేసి దేశానికి అందించిన బాపట్ల ఇప్పుడు యువతను మాధకద్రవ్యాల మత్తులో ముంచెత్తుతుందని అటు యువత తల్లిదండ్రులు ఇటు ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శని ఆదివారాలు వస్తే చాలు విద్యార్థులు గంజాయి మత్తులో ఈ లోకాన్నే మర్చిపోతున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ఈ డ్రగ్స్ దందాకు అధినేతలు అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతలని.. కొంతమంది వైసీపీ నేతలే ఈ మాదకద్రవ్యాలను అమ్ముతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు భహిరంగ సభల్లో ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు. అయినా అధికార ప్రభుత్వం మాత్రం ఈ మధ్యకద్రవ్యాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.

ఓవైపు ఆరోపణల జల్లు కురుస్తున్న నేపథ్యంలో మరో వైపు 400 కేజీలకు పైగా గంజాయి బాపట్లలో పట్టుబడింది. దీనితో ప్రతిపక్షాలు అధికార పార్టీని ఏకిపారేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడడం.. ప్రతిపక్షాలు గంజాయి పైన ఫోకస్ పెట్టడం అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని వైసీపీలో చర్చ నడుస్తోందని సమాచారం. ఈ గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోతున్నారు అనడానికి ఫిబ్రవరి ఆరో తారీకు సూర్య అస్తమయం సమయానికి సూర్యలంక రోడ్లో గంజాయి మత్తులో ఒక యువకుడ్ని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపడమే ఉదాహరణ.

హత్య జరిగింది. హంతకులను అరెస్ట్ చేసి 24 గంటల్లో కటకటాల్లోకి పంపారు. అయితే వీరంతా యువత కావడం గంజాయి మత్తులోనే ఈ హత్య జరిగిందని పుకార్లు బయటికి రావడంతో పోలీసులు కూడా అలర్ట్ అయినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే గంజాయి అమ్మకం జరిగే ప్రాంతం గురించి కొంతమంది పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ.. పలువురు బడా నేతల ఒత్తిడితో బయటికి చెప్పడం లేదనే విమర్శలు బయటికి రావడం పోలీసువర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.

టూరిస్ట్ కేంద్రంగా ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్న బాపట్లలో గంజాయి సప్లై కొనసాగితే రానున్న రోజుల్లో దీని ప్రభావం తీవ్రమవుతుందనేది మేధావులు చెప్తున్న మాట. సూర్యలంక బీచ్ నుండి రామాపురం బీచ్ వరకు ఇక్కడ పూర్తిస్థాయిలో రిసార్ట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, ఐటిసి హోటల్స్ వెలుస్తున్నాయి. దీంతో ఇక్కడికి ఎక్కువగా పొరుగు రాష్ట్రాల నుండి ఆహ్లాదం, ఆనందం కోసం చాలామంది యాత్రికులు వచ్చి వెళుతున్నారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ కూడా రిసార్ట్స్ లలో సేదతీరుతున్నారు. చిన్నచిన్న రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో గంజాయి సప్లై ఇలానే కొనసాగితే బాపట్ల మత్తు పదార్థాలకు అడ్డగా మారుతుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని.. దీని వెనుక ఎవత హస్తం ఉందనేది బయటకు తీసుకురావాలని బాపట్ల ప్రజలు, ప్రతిపక్ష నాయకులు పోలీసులను కోరుకుంటున్నారు.

ఈ విషయంలో ప్రధానంగా యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మద్యం సేవించి వస్తున్నాడా..? గంజాయి తాగి వస్తున్నాడా..? అని ఆలోచన తల్లిదండ్రులకు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుందని.. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారంతా ఎస్పి జిందాల్ ను కోరుతున్నారు.

Advertisement

Next Story