- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యతిరేకత బీజేపీ పైనే..! రాష్ట్రంలో తగ్గుతున్న ఆదరణ
దిశ, ఏపీ బ్యూరో: "రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమిని చవిచూసే అవకాశముంది. టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే 120 సీట్లు సాధించవచ్చు. అదే టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఓడిపోవచ్చు. కేవలం టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీతో గట్టి పోటీ ఉంటుంది!" అంటూ ఇటీవల శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రజలపై ఊపిరి సలపని విధంగా భారాలు మోపడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని ఈ సర్వే చెబుతోంది.
కేంద్రానికి అంటకాగుతున్న వైసీపీ ప్రభుత్వం అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కమలనాధులతో కలిస్తే పుట్టగతులుండవని చెప్పకనే చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఈడీ, సీబీఐ, ఈసీ, ఐటీలను చూస్తే అధికార, విపక్షాలకు వణుకు పుట్టొచ్చు. జనసేన భయపడాల్సిన అవసరమేముందని ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇలా రావడానికి దోహదపడిన అంశాలను అవలోకిస్తే..
ప్రజాగ్రహానికి కారణాలెన్నో..
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ సర్కారుపై ఇంతగా ప్రజల ఆగ్రహానికి బోలెడు కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది పెట్రోలు, డీజిల్‌ధరలను విపరీతంగా పెంచడం. లీటరు పెట్రోలు రూ.70 ఉన్నప్పుడు కన్నా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌ధరలు తగ్గినా ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజల జేబులు కొట్టడాన్ని భరించలేకపోతున్నారు. ఆయిల్‌పై కేంద్రానికి వచ్చే పన్నుల్లో 42 శాతం తిరిగి రాష్ట్రానికి చెల్లిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వమైనా ధరలు కొంతమేర తగ్గించవచ్చు. ధరల పెంపు నెపాన్ని వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకుంది. పన్నులు పెంచితే రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి వస్తుందని కేంద్రం సెస్సుల రూపంలో బాదుడుకి దిగుతోంది. పెట్రోలు, డీజిల్‌ధరలు పెంపుతో రవాణా చార్జీలు పెరిగాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. ఇవి చాలదన్నట్లు జీఎస్టీ పన్నులు వేస్తున్నారు. వంట గ్యాస్ధరను రెండింతలు పెంచారు. దీంతో సగటు ప్రజల జీవన వ్యయం పెరిగి ప్రభుత్వాలపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
విద్యుత్ పంపిణీ ప్రైవేటు పరం?
విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా ఉత్పత్తి, పంపిణీని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్దేశించింది. దీనికి తందానా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తోన్న రాయితీలను వదిలించుకోవడానికి సిద్ధమైంది. 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే పథకానికి కొర్రీలు వేస్తోంది. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చే రాయితీకి మంగళం పాడుతోంది. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకు ఎసరు పెట్టేందుకు మీటర్లు బిగించింది.
వైఎస్సార్ జల కళ పథకం కింద ఉచితంగా వేసే బోర్లను నిలిపేసింది. ట్రూ అప్చార్జీల పేరుతో జనానికి షాకులు మీద షాకులు ఇస్తోంది. ఇవి చాలవన్నట్లు థర్మల్విద్యుత్కేంద్రాలను అదానీ పరం చేసేందుకు సిద్ధమైంది. వీటికి అవసరమైన బొగ్గును టన్ను రూ.5 వేలకు బదులు విదేశాల్లోని అదానీ బొగ్గు గనుల నుంచి సుమారు రూ.25 వేల లెక్కన దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. ఇవన్నీ ఒక లెక్కయితే రేపో మాపో ప్రీపెయిడ్స్మార్ట్మీటర్ల భారాన్ని ప్రజల నెత్తిమీద మోపేందుకు కసరత్తు చేస్తోంది.
అప్పుల కోసం వెళితే కేంద్రం షరతులు
రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు అనుమతి కోరినప్పుడల్లా కేంద్రం షరతులు విధిస్తోంది. షరతుల్లో భాగంగానే విద్యుత్, అర్బన్సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. చెత్తమీద పన్నులు వేయడం, ఆస్తి విలువ ఆధారిత పన్నులు వేయడం, మంచినీటి కుళాయిలకు మీటర్లు బిగించి నీళ్ల అమ్మకానికి తెరదీయడం ఈ తంతులో భాగమే.
ఇంటి పన్నులు పెరగడంతో అద్దెలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దీంతో ప్రభుత్వాలు విధించే భారాలకు తోడు ఇంటి అద్దెలు భరింపశక్యంకాని స్థితికి చేరుకున్నాయి. ఇవన్నీ తమకు సంబంధం లేదని కేంద్రంపై నెట్టినా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వమే అయినందున ఆ సెగ వైసీపీకి తగలకపోదు.
అమలుకాని విభజన హామీలు
ఇంకా రాష్ట్రానికి విభజన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ప్రత్యేక హోదా లేదు. విశాఖ రైల్వే జోన్లేదు. ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఎత్తేసింది. కడప స్టీల్‌ప్లాంటును కేంద్ర సర్కారు నెలకొల్పాలి. దీనికి కొర్రీ వేసి రాష్ట్ర ప్రభుత్వం జిందాల్‌తో కలిసి ఏర్పాటు చేసేందుకు పావులు కదిపింది. రామాయపట్నంలో భారీ పోర్టును కేంద్రం నిర్మించాలి. దీన్ని సీఎం జగన్తాబేదారుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మైనర్పోర్టును నిర్మించేట్లు చేశారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా సకాలంలో అవసరమైన మేర నిధులు ఇవ్వకుండా కేంద్ర సర్కారు కొర్రీలు వేస్తోంది. 2024 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం కుదరదని చెప్పినా అధికార విపక్షాల్లో కించిత్తు రోషం లేదు. ప్రజలు త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు కేంద్రం కరాఖండిగా తేల్చి చెప్పింది. అయినా అధికార, ప్రతిపక్షాలు ఉత్తుత్తి విమర్శలతో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్య పెడుతున్నాయి.
పెరుగుతున్న మత వైషమ్యాలు
ఇవన్నీ ఒక ఎత్తయితే బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని ముస్లిం మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీల వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముస్లింలు, క్రైస్తవుల్లో నిరంతరం పెరుగుతున్న అభద్రతకు కారణమవుతున్న బీజేపీకి మూడు ప్రధాన పార్టీలు అంటకాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
గుజరాత్అల్లర్లకు అప్పటి సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ కారణమంటూ వెల్లడించిన బీబీసీ డాక్యుమెంటరీపై ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. అదానీ లాంటి కుబేరులకు కేంద్రం దాసోహమంటూ ప్రజల కష్టార్జితాన్ని దోచిపెడుతోందని విదేశీ రేటింగ్‌సంస్థలు కోడై కూస్తున్నా రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు కళ్లూ చెవులు మూసుకున్నారు.
అన్ని పార్టీలపై తీవ్ర ప్రభావం
ప్రజలు చీదరించుకుంటున్న బీజేపీని భుజాల మీద మోస్తోన్న వైసీపీ సర్కారుపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కమలనాధులతో పొత్తు పెట్టుకున్న జనసేనకూ ప్రజల నుంచి నిరసన సెగలు తప్పేట్టు లేవు. ఇప్పటికీ టీడీపీ గోడ మీద పిల్లివాటంగా కేంద్ర విధి విధానాలపై మాట్లాడకుండా అన్నింటినీ జగన్‌పై తోసేస్తోంది.
అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఓటమి తప్పదని శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. టీడీపీ, జనసేన కలిసి కేంద్ర సర్కారు విధి విధానాలను తూర్పారబట్టకుండా, వాటిని మోస్తున్న వైసీపీ మీదనే గురిపెట్టినా గెలుపు అంత తేలిక్కాదని ఈ సర్వే వెల్లడించింది.
- Tags
- ap politics
- apbjp