ఆపరేషన్ మదర్ పులి విఫలం.. జూకు తరలించకుంటే ముప్పే ?

by samatah |
ఆపరేషన్ మదర్ పులి విఫలం.. జూకు తరలించకుంటే ముప్పే ?
X

దిశ, కర్నూలు ప్రతినిధి : అడవి గడప దాటి జనావాసం చేరిన పులి కూనలను తల్లిపులి చెంతకు చేర్చడంలో అన్నీ తప్పిదాలే కన్పిస్తున్నాయి. అటు గ్రామస్తులు వాటిని పట్టుకుని గ్రామంలోని ఓ నిర్మాణ గోదాములో ఉంచడం..మరోవైపు అటవీ అధికారులు వాటిని సంరక్షణ పేరుతో ఆత్మకూరు తరలించడం వంటి వాటితో పులి కూనలు తల్లిపులిని మరచేలా చేశారు. అటవీ అధికారులు ఒకవైపు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయంటూనే మరో వైపు వాటి సహజ సిద్ధ వాతావారణానికి దూరం చేశారు. వీటితోపాటు తల్లిపాలకు బదులు కెమికల్ తో కూడిన పాలు, బాయిలర్ కోడిలివర్లను ఆహారంగా ఇవ్వడంతో అవి తమ ప్రాశస్థాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో పిల్లలను తల్లిపులి చెంతకు చేర్చే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతోఅటవీ అధికారులు ప్లాన్-బీ అమలు చేసి చేతులు దులుపుకునే యోచనలో ఉన్నారు. అదే జరిగితే పులి పిల్లలు తమ సహజ సిద్ధ లక్షణాలను కోల్పోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

కొత్త ప్రపంచంలోకి పులి కూనలు

అధికారులు ఆత్మకూరు పట్టణంలోని అటవీశాఖ అతిథి గృహంలోని ఓ ఏసీ గదిలో పులి పిల్లలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచారు. వీటికి గదిలో గ్రీన్ కార్పెట్, ఎఈడీ లైట్లు, ఏసీ వంటి కృత్రిమ వాతావరణంలో ఉంచారు. ఈ సమయంలో అవి తమ సహజత్వాన్ని కోల్పోయి మెల్లగా కృత్రిమ వాతావరణానికి అలవాటు పడే అవకాశం ఉంది.

అమలు దిశగా ప్లాన్-బీ

నాలుగు రోజులపాటు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన భారతదేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అటవీశాఖ దారి తప్పిన 4 పులి కూనలను తల్లి పులి వద్దకు చేర్చేందుకు ప్లాన్-ఏను అమలు చేసింది. అందుకోసం అటవీ అధికారులు 300 మంది సిబ్బంది, 40 కెమెరా ట్రాప్ లతో పిల్లలను కలిపే ప్రయత్నంచేసింది. కానీ అది విఫలమైంది. పెద్దపులి సంచరించిన ప్రాంతాలైన ముసలిమడుగు, గుమ్మడాపురం గ్రామాల సమీపంలో రెండు వేర్వేరు చోట్లా తల్లిపులి పాద ముద్రికలను గుర్తించారు. ఈరెండు ముద్రలు కూడా ఒకే పులివని, ఆ పులి తప్పిపోయిన టీఎఫ్-108 అని చెబుతున్నా పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో గత రాత్రి చేపట్టిన ఆపరేషన్ మదర్ టైగర్ విఫల‌మైంది. దీంతో ప్లాన్-బీ దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే అంతిమంగా రెండ్రోజుల్లో తిరుపతి జూకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లేకపోతే పులి కూనల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story