నెల్లూరులో కాకరేపుతున్న కోటంరెడ్డి టీడీపీ ఎంట్రీ

by sudharani |
నెల్లూరులో కాకరేపుతున్న కోటంరెడ్డి టీడీపీ ఎంట్రీ
X

దిశ, నెల్లూరు: ఇటీవల వైసీపీని విభేదించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏ పార్టీలో చేరుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలో చేరుతానని కోటంరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనతో కొందరు టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. కోటంరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమని చెబుతున్న వేళ కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తమకు ప్రాధాన్యత తగ్గుతుందని పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది.

శ్రీధర్ రెడ్డి రాకను ఎలాగైనా అడ్డుకునేందుకు కొందరు టీడీపీ నేతలు వరుస ప్రెస్‌మీట్లు పెట్టి కోటంరెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో టీడీపీ నేతలపై శ్రీధర్ రెడ్డి దాడి చేశారని గుర్తుచేస్తూ ప్రెస్‌మీట్‌లు పెడుతూ పార్టీలో కోటంరెడ్డిపై వ్యతిరేఖత పెరిగేలా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీధర్ రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని కొందరు టీడీపీ నేతలు ఎస్సీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

కోటంరెడ్డిని విభేదించేందుకు కారణం

చంద్రబాబు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. జిల్లా టీడీపీలో మాజీ మంత్రి సోమిరెడ్డి, బీదా రవిచంద్ర, అబ్ధుల్ అజీజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కోటంరెడ్డి టీడీపీలో చేరితే తమకు ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వారిలో మొదలైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తమ అనుచరులతో పాత గాయాలను రేపుతూ వరస ప్రెస్‌మీట్లు పెట్టి కోటంరెడ్డిని తీవ్రంగా విభేదిస్తూ పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్న టాక్ వినిపిస్తుంది. కోటంరెడ్డి రాజకీయంగా బలమైన నేత, దూకుడుగా వ్యవహరించే వ్యక్తి. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారి చక్రం తిప్పగలరు. అప్పుడు సోమిరెడ్డి, బీదా రవిచంద్ర, అబ్ధుల్ అజీజ్ వంటి నేతలు జిల్లా పట్టుకోల్పోతామన్న భయంతోనే కోటంరెడ్డిని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల్లో ఓ అభిప్రాయం ఉంది.

కాకరేపిన అజీజ్ ఆరోపణలు

ఇటీవల శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేత అబ్ధుల్ అజీజ్ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగులు ఆడేవారిని, సింగల్ నెంబర్లు ఆడించేవారిని టీడీపీలోకి ఆహ్వానించేది లేదన్నారు. ఎవరైనా ఇంట్లో పండ్ల, పూల మొక్కలు నాటుకుంటారు కానీ గంజాయి మొక్కలు నాటుకోరు కదా అని ప్రశ్నించారు. టీడీపీ విలువలతో కూడిన పార్టీ అని, దానిలోకి ఎవరిని పడితే వారిని ఆహ్వానించరని చెప్పారు. టీడీపీ నేతలపై దాడులు చేసినవాళ్లు, కార్యకర్తలను కేసులతో వేధించినవాళ్లు, బెట్టింగ్ బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించేవాళ్లు టీడీపీకి అవసరంలేదని తేల్చి చెప్పారు. దీంతో కోటంరెడ్డిపై పరోక్ష ఆరోపణలు చేయడం పార్టీలోకి ఆయన ఎంట్రీ హాట్‌టాపిక్‌గా మారింది.

చంద్రబాబుతో చర్చించాకే కోటంరెడ్డి వైసీపీని టార్గెట్ చేశారా?

శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు లోకేశ్‌తో చర్చలు జరిపాకే కోటంరెడ్డి వైసీపీని టార్గెట్ చేశారని ఆరోపణలు లేకపోలేదు. టీడీపీ అవకాశం ఇస్తే పార్టీ తరఫున రూరల్ నుంచి పోటీ చేస్తానని శ్రీధర్ రెడ్డి భావిస్తున్నారు. సొంత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడానికి ముందే కోటం రెడ్డి చంద్రబాబు నుంచి రూరల్ టికెట్ హామీ పొందాలని సమాచారం సాగింది. నెల్లూరులో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనం రామనారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉన్నా స్థానికంగా మాత్రం ఆ ఇద్దరికీ టీడీపీ నేతల నుంచి మద్దతు లభించడం లేదు.


ఇవి కూడా చదవండి :

బ్రేకింగ్: వేగం పెంచిన CBI.. వివేకా హత్య కేసులో MP అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు

Next Story

Most Viewed