ఏపీలో కొత్త పార్టీలు.. జగన్‌ను ఎదుర్కొంటారా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-09 03:18:17.0  )
ఏపీలో కొత్త పార్టీలు.. జగన్‌ను ఎదుర్కొంటారా?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్యే రాజకీయం అంతా తిరుగుతుందని అంతా భావిస్తూ వచ్చారు. ఇటీవల బీజేపీ కూడా రాష్ట్రంలో దూకుడుగానే వెళుతోంది. దీంతో అధికార వైసీపీ రాబోయే ఎన్నికల్లో ఎలా వీరిని ఎదుర్కొంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటు వైసీపీ కూడా తమపై నెలకొని ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీరి వైపు మరలకుండా ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. అనూహ్యంగా కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

ఇటీవల సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ హఠాత్తుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో భేటీ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతుందని, జగన్ సోదరి, బ్రదర్ అనిల్ భార్య నేతృత్వంలోని రాష్ట్రంలోనూ అడుగుబెడుతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అసంతృప్తి ఉన్న వారిని ఏకతాటిపైకి చేర్చేలా పార్టీని షర్మిల ఇక్కడ పటిష్టం చేయబోతున్నారని, ఈ క్రమంలోనే బ్రదర్ అనిల్ రాష్ట్రంలో ఈ సుడిగాలి పర్యటన చేశారనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవం అని, కేవలం వేరే అంశంపై మాట్లాడడానికే ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశానని, ఇప్పటికైతే వేరేపార్టీ పెట్టే ఆలోచన ఏదీ లేదని బ్రదర్ అనిల్ చెబుతున్నారు. కానీ ఇప్పటికీ బ్రదర్ అనిల్ సమావేశాలను రాజకీయ కోణంలోనే చూస్తున్నారు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు.

మరోవైపు రాజకీయాల్లో తమదైన చక్రం తిప్పడానికి కాపునేతలు రెడీ అవుతున్నారు. వారం క్రితం విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కాపు సామాజిక ప్రముఖులు భేటీ అయ్యారు. అంతకు ముందు గత డిసెంబర్ లో హైదరాబాద్‌లో పార్టీలకతీతంగా సమావేశమై రహస్య సమాలోచనలు జరపడం తెలిసిందే. ఈసారి అందరికీ తెలిసేలానే విశాఖలో సమాలోచనలు జరిపారు. మాజీ డీజీపీ సాంబశివరావు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంత కుమార్, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయమే ముఖ్యం అని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా బహుజనులను కలుపుకుని రాష్ట్ర రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు మాజీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఒక వేదిక ఉండాలంటూ ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ ను ప్రారంభించామని కాపు నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో కాపు జనాభా సుమారుగా 15.2 శాతం ఉంది. కమ్మ, రెడ్డి వర్గాలకే సీఎం పదవులు దక్కుతున్నాయి తప్ప కాపులకు మాత్రం ఆ అవకాశం లభించలేదు అన్న ఫీలింగ్ ఆ వర్గంలోని కొందరు ప్రముఖుల్లో బలంగా ఉంది. వారి మాటలు సమావేశాలు మాత్రం కొత్త రాజకీయ ప్రస్థానం వైపే అని ప్రజానీకం భావిస్తున్నది.

కొత్త పార్టీలను ఊరిస్తున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులు

2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఇక పూర్తిగా సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి పెట్టింది. ఇతర అంశాలను పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఇతర అంశాలపై ప్రజల్లో ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత నెలకొని ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మరి వీరిలో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే

Advertisement

Next Story

Most Viewed