సీఎం డిజిటల్​ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు?: నారా లోకేష్

by Javid Pasha |
సీఎం డిజిటల్​ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు?: నారా లోకేష్
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్​ ఇంట్లోనే దొంగలు పడడమేంటీ ? సీఎం డిజిటల్​ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు ! 225 ఫైళ్లు క్లియర్​ చేయడం ద్వారా వందల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే సీఎం పబ్జీ ఆడుకుంటున్నాడా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అటెండర్లపై కేసులు పెట్టి దొంగలు తప్పించుకు తిరుగుతున్నట్లు లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల బహిరంగ సభలో లోకేష్​ ప్రసంగించారు.

జగన్​ 420 అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలు 840లు అని లోకేష్​ చమత్కరించారు. రాష్ట్రానికి రాజధాని మధ్యలో ఉండాలని నాడు సీఎం జగన్​తోపాటు జిల్లా నేతలు చెపారు. అమరావతికి జై కొట్టారు. అందుకే జగన్​ ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. గెలిచిన తర్వాత జగన్​ మాట మార్చాడు. మడమ తిప్పాడు. రాష్ట్రానికి ఆయుపట్టు అయిన అమరావతిని ధ్వంసం చేశాడు. అమరావతిని శ్మశానం అన్నారు. భూకంపాలు వస్తాయన్నారు. మునిగిపోతుందంటూ అనేక అబద్దాలు వల్లె వేశారు. జగన్​ కుట్రలను తట్టుకొని అమరావతి నిలబడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలకు సిగ్గుంటే.. పుట్టిన ప్రాంతంపై మమకారం ఉంటే జగన్​ను నిలదీయాలని లోకేష్​ హితవు పలికారు.

సీఎం జగన్​ సంక్షేమ పథకాల పేరిట ఒక చేత్తో పది రూపాయలు ఇస్తున్నాడు. మరో చేత్తో వంద లాక్కుంటున్నాడు. ఓ వ్యక్తి రోజుకు ఓ క్వార్టర్​ మందు తాగితే బాటిల్​పై రూ.25 అదనంగా బాదేస్తున్నారు. నెలకు రూ.750, ఏడాదికి రూ.9 వేలు, ఐదేళ్లకు రూ.45 వేలు జే ట్యాక్స్​ కడుతున్నట్లు లోకేష్​ వెల్లడించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం తర్వాత ఓట్లు అడుగుతానన్న సీఎం గెలిచాక లిక్కర్​ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచినట్లు పేర్కొన్నారు. అంతకంటే ప్రమాదం ఏమంటే జగన్​ లిక్కర్​ విషం కంటే డేంజరన్నారు. నాలుగేళ్లలో జే బ్రాండ్ మద్యం తాగి చనిపోతున్న వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుందని లోకేష్​ తెలిపారు.

గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ హయాంలోనేనని లోకేష్​ గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ. 2,265 కోట్లతో అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. రూ.336 కోట్లతో ఆరు వేల టిడ్కో ఇళ్లు, రూ.216 కోట్లతో ఎన్టీఆర్​ గృహాలు, రూ.220 కోట్లతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్​ నిర్మించినట్లు లోకేష్​ తెలియజేశారు. రూ.170 కోట్లతో ఆర్​అండ్​బీ రోడ్లు, తాగు నీటి ప్రాజెక్టులు, గురజాల, పిడుగురాళ్ల పట్టణాల అభివృద్ధికి వెచ్చించినట్లు తెలిపారు. రూ.160 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించినట్లు లోకేష్​ వివరించారు. రానున్న ఎన్నికల్లో గురజాలలో టీడీపీని గెలిపించాలని లోకేష్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story