Nara Lokesh : 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నారా లోకేష్ పాదయాత్ర

by Mahesh |   ( Updated:2023-02-21 07:34:14.0  )
Nara Lokesh  : 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నారా లోకేష్ పాదయాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర 300కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలోనూ ఒక అభివృద్ధి పని తలపెడుతున్న లోకేష్ తాజాగా 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొండ‌మానుపురంలో 300కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పంచాయ‌తీ ప‌రిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే ర‌క్షిత మంచి ప‌థ‌కాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.

ఈ ప్రాంతానికి సమీపంలో నది ఉన్నప్పటికీ చ‌ల్లపాలెం, వెంక‌టాపురం, సుబ్బనాయుడు కండ్రిగ‌, తొండ‌మ‌నాడు, చెర్లోప‌ల్లి, అమ్మపాళ్యం, కొత్తపాలెం, మున్న స‌ముద్రం, బొక్కసం పాలెం, సిద్ధయ్య గుంట‌, మ‌ర్లపాకు, రాచ‌గున్నేరి, మ‌ద్దిలేడు గ్రామ‌వాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మాచారం తెలుసుకున్న నారా లోకేష్ త‌న పాద‌యాత్ర 300 కి.మీ. మ‌జిలీ చిర‌కాలం గుర్తుండేలా తాగునీటి ప‌థ‌కం ఏర్పాటుచేసి ప్రతీ ఇంటికి నీరందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

రైతులతో లోకేశ్ ముచ్చట

అనంతరం వరి పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తున్న రైతులతో లోకేశ్ మాట్లాడారు. విత్తనం దగ్గర నుండి పురుగుల మందులు, ఎరువుల వరకు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని రైతులు లోకేశ్ వద్ద వాపోయారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వలన తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని తమ ఆవేదన వెలిబుచ్చారు. రైతు రాజ్యం తెస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ నేడు రైతు లేని రాజ్యం తెస్తున్నారు అని లోకేశ్ మండిపడ్డారు. పురుగుల మందు కొడితే పురుగులు చావడం లేదు. జగన్ బ్రాండ్ మద్యం కొడితే పురుగులు ఖచ్చితంగా చస్తాయి అని చెప్పుకొచ్చారు. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు.

రూ.3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఆ నిధి ఎం అయ్యింది? అని లోకేశ్ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తాం అని లోకేశ్ హామీ ఇచ్చారు. పెట్టుబడి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు మహిళలను ఉద్దేశించి వైసీపీ ప్రభుత్వం వేస్తున్న పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని చెప్పుకొచ్చారు. గ్యాస్ ధర ఆకాశానికి చేరింది. ప్రజల పై పన్ను భారం తగ్గించాలి. సామాన్యులు, పేద వారు బ్రతికే పరిస్థితి లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు

Advertisement

Next Story

Most Viewed