చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బిగ్ డెసిషన్

by Javid Pasha |   ( Updated:2023-09-30 11:26:24.0  )
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బిగ్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున భువనేశ్వరి నిరాహార దీక్ష చేయనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ఇవాళ ప్రకటించారు. అలాగే అక్టోబర్ 2న రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ప్రతిఒక్కరూ చంద్రబాబుకు మద్దతుగా తమ ఇంట్లోని లైట్లు ఆపేసి బయటకు వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన చోట ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో అచ్చెన్నాయడు, బాలకృష్ణతో పాటు కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. చంద్రబాబు అరెస్ట్‌ వార్తలు టీవీలో చూసి మనస్తాపంతో మృతి చెందినవారికి సంతాపం ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 97 మంది చనిపోయారని, వారి కుటుంబాలను త్వరలోనే కలిసి అండగా ఉంటామని చెప్పారు.

టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని సమావేశంలో చర్చించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ చేపట్టనున్న వారాహి విజయ యాత్రకు టీడీపీ కూడా మద్దతిస్తుందన్నారు. త్వరలోనే టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాయన్నారు. నారా భవనేశ్వరి చేపట్టనున్న నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాజమండ్రిలో భువనేశ్వరి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నిర్వహిస్తున్న ర్యాలీలలో పాల్గొంటున్నారు. టీడీపీ నేతల నిరసన దీక్షలలో కూడా పాల్గొంటున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న టీడీపీ.. ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. భువనేశ్వరి నిరాహార దీక్షలో పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొనే అవకాశముంది. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ చేపడతారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

Advertisement

Next Story