- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్..!
దిశ, హైదరాబాద్ బ్యూరో : దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్‌లో ఆహార నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నిర్వహిస్తూ కల్తీ ఆహారం విక్రయిస్తున్నా తూతూమంత్రంగా అధికారుల దాడులు ఉండడంతో నగర ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటి వరకు దేశంలో బిర్యాని అనగానే హైదరాబాద్ గుర్తుకు వచ్చేది. ఇక నుంచి దీనిని మరిచిపోవాల్సి వస్తుందేమో అనేలా పరిస్థితులు మారాయి. నాసిరకమైన ఆహార పదార్ధాలతో పాటు రసాయనాలతో కూడిన రంగులు కలపడం వంటివి చేస్తుండడంతో హైదరాబాద్ బిర్యాని కూడా ప్రతిష్టను కోల్పోతుందనేది జీర్ణించుకోలేని వాస్తవం.
ఇటీవల హైదరాబాద్ రియల్‌ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ట్రావెలర్, జొమాటో టాప్ రెస్టారెంట్ అవార్డులు 2024 నిర్వహించారు. ఇందులో దేశంలోని అన్ని నగరాల నుంచి టాప్ 50 రెస్టారెంట్లను ఎంపిక చేయగా హైదరాబాద్ నుంచి కేవలం ఒకే ఒక ‘మనం చాక్లెట్ కార్ఖానా’ మాత్రమే ఎంపిక కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. అవార్డులు గెలుచుకున్న వాటిల్లో 13 ముంబాయికి చెందిన రెస్టారెంట్లు, 10 గోవా, 8 బెంగళూరు, 5 ఢిల్లీకి, 3 చెన్నై, 3 కోల్‌కతా, 2 గురుగాంకు చెందిన రెస్టారెంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు కాసౌలి, జైపూర్, శాంతినికేతన్, మైసూరు, పూణేలు ఒక్కటి చొప్పున ఆఖరి స్థానానికి పోటీపడుతున్నాయి. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో వేల సంఖ్యలో హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిల్లో త్రిస్టార్, ఫైవ్‌స్టార్, సెవెన్‌స్టార్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ పేరుకే అంతర్జాతీయ స్థాయిగా ప్రచారం చేసుకుంటున్నాయి.
పెరిగిపోతున్న కల్తీ ఆహారం అమ్మకాలు..
హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హోటల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఆహారం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం హైదరాబాద్‌లో కల్తీ ఆహారం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ సంస్థ కొన్ని నెలల క్రితం దేశంలోని 19 ప్రధాన నగరాలలో సర్వే నిర్వహించగా వందల సంఖ్యలో కేసులు నమోదై దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో సుమారు 84 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. వేల సంఖ్యలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లకు కేవలం పదుల సంఖ్యలో ఆహార భద్రతా అధికారులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు నెల రోజులుగా జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల సందర్భంగా దాదాపు సగం హోటల్స్‌లో పాడైపోయిన ఆహారం, గడువు తీరిన ప్యాకింగ్ ఆహారం, నాసిరకం వంట సామగ్రిని గుర్తించారు. కేవలం ఆకర్షణీయంగా, లాభార్జనే ధ్యేయంగా వండుతున్న ఆహారం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా మారింది.
చట్టం ఏం చెబుతోంది..?
దేశంలో 1954లో ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్) 2006ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నాణ్యతా ప్రమాణాలు లేని సామగ్రిని ఆహారంలో వాడరాదు. కల్తీ చేసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం వంటివి చేయరాదు. ఇలా చట్టం బలంగా ఉన్నప్పటికీ పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది కొరత, అధికారుల అవినీతి తదితర కారణాలతో యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.
మేయర్ తనిఖీలలో విస్తుపోయే నిజాలు..
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్‌లో కిచెన్‌ను పరిశీలించిన ఆమె అక్కడున్న పరిస్థితులను చూసి అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచగా కుళ్లిపోయిన చికెన్, మటన్, జిడ్డు కారుతున్న వంట సామాగ్రి చూసి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పైప్ లైన్ పక్కనే కిచెన్ ఉండడాన్ని ఆమె గుర్తించారు. ఆహారం శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటల్స్ పై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.