ములాఖత్ మతలబు: చంద్రబాబుతో పవన్,లోకేశ్,బాలకృష్ణల భేటీ

by Seetharam |   ( Updated:2023-09-14 07:53:08.0  )
ములాఖత్ మతలబు: చంద్రబాబుతో పవన్,లోకేశ్,బాలకృష్ణల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ములాఖత్‌లో భాగంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా వీరి భేటీ కొనసాగుతుంది. పలు కీలక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా కలిసేందుకు నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం వద్ద పవన్ కల్యాణ్ రాకకోసం వేచి చూస్తున్నారు. ములాఖత్‌లో భాగంగా చంద్రబాబు నాయుడును పవన్ కల్యాణ్ కలవాల్సి ఉంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్‌ అక్కడ నుంచి సెంట్రల్ జైలు వద్దకు ర్యాలీగా బయలు దేరారు. అయితే అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని కాబట్టి అనుమతి నిరాకరించారు. కేవలం 5 వాహనాలకు మాత్రమే ర్యాలీకి పోలీసులు అనుమతించారు. అయితే అభిమానులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సెంట్రల్ జైలు వద్దకు రావడం ఆలస్యంగా మారింది. అనంతరం పవన్ కల్యాణ్ మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అనంతరం లోపల వ్యక్తిగత వివరాలను నమోదు చేయించుకుని బాలకృష్ణ, లోకేశ్‌లతోకలిసి పవన్ కల్యాణ్ చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా కలిశారు.

Read More: చంద్రబాబు శక్తి, సామర్థ్యాలు వెలకట్టలేనివి.. ఏపీలో అరాచక పాలన : పవన్ కల్యాణ్

Advertisement

Next Story

Most Viewed