కాంగ్రెస్ నాయకులకు పదవులు తప్ప పాలన చేతకాదు : కల్వకుంట్ల కవిత

by Kalyani |
కాంగ్రెస్ నాయకులకు పదవులు తప్ప పాలన చేతకాదు : కల్వకుంట్ల కవిత
X

దిశ, గజ్వేల్ రూరల్ : రాష్ట్రంలో సాగునీరు లేక లక్షల ఎకరాల పంట పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం రైతుల కష్టాలు పట్టడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైతుల పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి గోస పేరిట గోదావరిఖని నుంచి ఎర్రవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారు. ఈ మహా పాదయాత్ర శనివారం ప్రజ్ఞాపూర్ కు చేరుకున్న సందర్భంగా పాదయాత్రకు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని, ఈనాడు అదే కాంగ్రెస్ మీద పిడికిలేత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్లు తప్పకుండా మన పొలాలకు వస్తాయని అన్నారు. పడవల పోటీ పెట్టుకున్న గోదావరి నదిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏడారిలా మార్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంట పొలాలు సాగునీరు లేక ఎండుతున్నా సిగ్గు లేకుండా చూస్తూ కూర్చుంటున్నారు తప్ప కాంగ్రెస్ నాయకులకు రైతుల కష్టాలు పడ్తలేవని మండిపడ్డారు. సమ్మక్క, సారక్క వద్ద కేసీఆర్ వచ్చాక డ్యామ్ నిర్మించిన అనంతరం స్టోరేజ్ వచ్చిందనీ, రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపుకున్నామని, ఇంటింటికి తాగునీటిని అందించామన్నారు. ఒకప్పుడు తలాపున పారేటి గోదారి… మన బతుకులు ఎడారి అని పాడుకున్న తెలంగాణను కేసీఆర్ గోదావరి నీటితో చెరువులను నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని, ఎండకాలంలో సైతం చెరువులు మత్తడి దుంకేలా గోదావరి నీటిని కేసీఆర్ సద్వినియోగం చేశారని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్లనే గోదావరి జలాలు హైదరాబాద్ మహానగరాల వరకు ప్రతి ఇంటికి చేరాయని స్పష్టం చేశారు.

కేవలం రూ. 6 కోట్లు ఖర్చుపెడితే మోటార్లు రిపేర్ అవుతాయనీ దానితో లక్ష ఎకరాలకు పంట వస్తదనీ అన్నారు. అక్కడికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వెళ్లి బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తలేవట అది కూడా తెలవకుండ ఇరిగేషన్ మంత్రి అక్కడికి పోయిండని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నియ్యత్ యెట్లా ఉందంటే ఏది ఏమైనా కానీ మా రాజకీయం మాకు కావాలి అని ఉంటదని, మేడిగడ్డ వద్ద ఏదో జరిగిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కుట్ర పన్నారని ఆ మరుసటి నాడే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ను పంపించడం వంటివి జరిగాయని గుర్తు చేశారు. మరి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఎన్డీఎస్ఏ వాళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు వినియోగించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పొలాలను ఎండబెడుతూ రైతుల నోట్లలో మట్టికొడుతున్నదని అన్నారు.

గత 10 యేండ్ల బీఅర్ఎస్ పాలనలో గోదావరి నది యెట్లా పొంగిపోర్లిందో ఆ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి నీళ్ల కోసం పోరాటం, పాదయాత్ర చేస్తున్న కోరుకంటి చందర్ కు నా వందనాలని అన్నారు. ఈ పాదయాత్రకు గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, సమన్వయ సమితి సభ్యులు పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మద్ది రాజిరెడ్డి, బొల్లారం ఎల్లయ్య, రఘుపతి రెడ్డి, కృష్ణా గౌడ్, గొడుగు స్వామి, రమేష్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story