భ్రమల్లో చంద్రబాబు అండ్ కంపెనీ

by srinivas |   ( Updated:2023-12-09 16:12:43.0  )
భ్రమల్లో చంద్రబాబు అండ్ కంపెనీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఇతర దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావంతో ఇక్కడ అధికారానికి వస్తామనే భ్రమల్లో చంద్రబాబు అండ్‌ కంపెనీ ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా అధికారం దూరం కావడంతో తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలకు, కులపెద్దలకు మెదళ్లు పనిచేయడం పూర్తిగా మానేసినట్లున్నాయని ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అక్కడ ప్రాంతీయ పార్టీ ఓడితే ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుందని భావించడం అవివేకమన్నారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న బాబు పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన జాతీయపక్షం తెలంగాణ ఎన్నికల్లో గెలవడానికి తమ వంతు కృషి చేసినట్టు నటించినట్లు పేర్కొన్నారు. రాజస్తాన్‌లో మాదిరిగానే కర్ణాటకలో ప్రతి అయిదు సంవత్సరాలకూ పాలకపక్షాన్ని అధికారం నుంచి తొలగించే ఆనవాయితీ కన్నడిగులకు ఉందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.


దక్షిణాదిలో లేదా తూర్పు ప్రాంత సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు ఒకదానితో ఒకటి పొంతన ఉండవని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న పరిస్థితి ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణపై పడిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తోటి తెలుగు రాష్ట్రంలో ఐదు నెలలకు జరిగే శాసనసభ ఎన్నికలపై పడుతుందనే అసంబద్ధమైన, భ్రమాజనిత ఆశలతో కూడిన లోకంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం సహా ఆ పార్టీ నేతలందరూ విహరిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించలేని టీడీపీకి ప్రజలు పట్టం కట్టే అవకాశాల్లేవని విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story