నోరు అదుపులో పెట్టుకో..Nara Lokeshకు మంత్రి నాగార్జున వార్నింగ్

by srinivas |   ( Updated:2023-02-13 11:15:12.0  )
నోరు అదుపులో పెట్టుకో..Nara Lokeshకు మంత్రి నాగార్జున వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కులతత్వం, మోసపూరిత విధానాలు, మితి మీరిన అవినీతి కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ విషయం లోకేశ్‌కు తెలియకపోతే చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిచేలా మాట్లాడితే ప్రజలే లోకేశ్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2019 ఎన్నికలలో ఓడిపోయింది టీడీపీ కాదని, ప్రజలు, యువతీ యువకులు ఓడిపోయారంటూ పాదయాత్రలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నాగార్జున కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిరస్కరించి వైసీపీకి ఎందుకు పట్టం కట్టారో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుపై వక్రభాష్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకునే ముందు మంగళగిరి ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో లోకేశ్ మొదట తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు.

కులతత్వ రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌

కులతత్వ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు... రాజధాని ఏర్పాటు విషయంగా శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను కూడా తుంగలో తొక్కారని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. తన కులం వారికి మాత్రమే అత్యధిక సంపదను తెచ్చి పెట్టేలా అమరావతి రాజధానిని ప్రకటించారని విమర్శించారు. అన్ని పథకాల్లోనూ తన సొంత సామాజికవర్గానికే చంద్రబాబు పెద్దపీట వేసారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్ర యువతను మోసం చేసారని చెప్పారు. 2014 ఎన్నికలలో 600లకు పైగా వాగ్దానాలు చేసి వాటిలో పట్టుమని పది వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈ విషయాలను విస్మరించి జగన్ పరిపాలన అంతా మోసమని లోకేష్ మాట్లాడటం గురివింద గింజ చందంగా ఉందని మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లోకే‌శ్‌కు లేదని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed