ఆర్బీకేకు తాళం.. 'ఆసరాగా ఉంటుందని అనుకుంటే, భారంగా మారింది'

by Manoj |
ఆర్బీకేకు తాళం.. ఆసరాగా ఉంటుందని అనుకుంటే, భారంగా మారింది
X

దిశ, ఏపీ బ్యూరో : రైతు భరోసా కేంద్రాలకు అద్దెచెల్లింపుల వ్యవహారం భారంగా మారింది. గతంలోనూ.. ఇప్పటికీ కొన్ని సచివాలయాలు అద్దెల్లోనే నిర్వహిస్తున్న పరిస్థితి. తాజాగా ఆర్బీకేలు కూడా అద్దెగదుల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి కూడా ప్రభుత్వం అద్దెలు చెల్లించకపోవడంతో అద్దెకు ఇచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి ఇంటి యజమాని తాళం వేసేశాడు.

బత్తుల రోశయ్య అనే ఇంటి ఓనరు రైతు భరోసా కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయారు. గత సంవత్సర కాలం నుండి అద్దె చెల్లించడంలేదని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి అద్దెకు సంబంధించి ఇప్పటికే పై అధికారులకు తెలియజేసిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఈ నేపథ్యంలోనే రైతు భరోసా కేంద్రానికి తాళం వేసినట్లు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ఆసరాగా ఉంటుందని రైతు భరోసా కేంద్రానికి ఇల్లు అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. కానీ అంతా రివర్స్ అయ్యిందని వాపోయాడు. ఏడాది కాలంగా అద్దె రాకపోవడంతో నా కుటుంబ పోషణ భారంగా మారింది రోశయ్య వాపోయారు.

Advertisement

Next Story

Most Viewed