సమయం లేదు.. నేటితో ముగియనున్న ఓటీఎస్ గడువు

by Rani Yarlagadda |
సమయం లేదు.. నేటితో ముగియనున్న ఓటీఎస్ గడువు
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లు బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్ టైమ్ సెటిల్‌మెంట్-2024 (ఓటీఎస్) పథకం నేటితో ముగియ‌నుంది. ఈ నెల 30వ తేదీతో బిల్లులు చెల్లించే గడువు పూర్తవుతుంది. ఈ లోపు ఓటీఎస్ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జ‌ల‌మండ‌లి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ‌డువు లోపు పెండింగ్‌లో ఉన్న అసలు మొత్తం కడితే.. ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే, పెండింగ్ బిల్లుల మీద వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.

అక్టోబ‌ర్‌లో ప్రారంభమైన ఈ ప‌థ‌కం ఆ నెల చివ‌రి వ‌ర‌కు కొన‌సాగింది. అయితే పండ‌ుగ‌లు రావడం, ప్రజ‌లు సొంతూళ్లకు వెళ్లడం, ఆర్థిక భారం ప‌డ‌టంతో ప‌థ‌కాన్ని స‌రిగా వినియోగించులేక‌పోయారు. మ‌రోసారి ప‌థ‌కం గ‌డువును పెంచాల‌ని వారి నుంచి విజ్ఞప్తులు వ‌చ్చాయి. దీంతో జ‌ల‌మండ‌లి ప‌థ‌కం గ‌డువును పెంచాల‌ని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మ‌రో నెల అంటే న‌వంబ‌ర్ ఆఖ‌రి వ‌ర‌కు పొడిగించేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచే అవకాశం లేదు. పథకం గడువు ముగిసిన అనంతరం బిల్లులు పెండింగులో ఉన్న వినియోగదారులపై డిసంబ‌ర్ 1 నుంచి చ‌ర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారి నల్లా కనెక్షన్ సైతం తొలగించనున్నారు. బిల్లులు చెల్లించే విధానం జలమండలి కార్యాలయాలు, ఆన్‌లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఎన్‌ఈ‌ఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, బీపీపీఎస్, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed