మద్యం స్కాం కేసు: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

by Seetharam |   ( Updated:2023-11-23 12:44:31.0  )
మద్యం స్కాం కేసు: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌, చంద్రబాబు తరఫున నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ గురువారం వాదనలు వినిపించారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రతిపాదన పంపారని..కమిషనర్‌ ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించిందని న్యాయవాది నాగముత్తు కోర్టుకు తెలియజేశారు. ఫైల్‌పై అప్పటి రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సంతకాలు చేశారని అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదని వాదించారు. దీంతో ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. ఇకపోతే ఈ మద్యం పాలసీలో అక్రమాలపై కేసులో బుధవారం కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. సీఐడీ అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం రాజకీయ కక్షతోనే వరుస కేసులు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు 17ఏ నిబంధన చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని స్పష్టం చేశారు. అభియోగాల నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాని ఫలితంగా భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని వాదించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్లాలి లేదా సవరించి ముందుకు వెళ్లాలని..అలా కాకుండా వెళ్తే అవినీతి విస్తృతం అవుతుందని కోర్టుకు తెలియజేశారు. ఎక్సైజ్ పాలసీనీ 5 నుంచి 10 శాతానికి ఉద్దేశ పూర్వకంగా మార్చారని సీఐడీ ఆరోపించింది. అలాగే కొంతమందికే లబ్ధి కలిగేలా మార్పులు చేసి లైసెన్స్ ఇచ్చారని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

కేసు పూర్వాపరాలు ఇవే

ఇకపోతే ఈ మద్యం కేసులో చంద్రబాబును ఏ3గా, నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏ2 గా చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా కొన్ని మద్యం డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ ఆరోపించింది. మరోవైపు దీంతో అటు కొల్లు రవీంద్ర ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురు పిటిషన్లపై గత మూడు రోజులుగా హైకోర్టు విచారణ చేపట్టింది. గురువారం కూడా ఈ కేసును హైకోర్టు విచారించింది. ఇరువాదనలు విన్న అనంతరం కేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Advertisement

Next Story