Nandikotkur MLA సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న వైసీపీ నాయకులు

by srinivas |   ( Updated:2022-12-28 14:34:25.0  )
Nandikotkur MLA సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న వైసీపీ నాయకులు
X

దిశ, కర్నూలు: నంద్యాల జిల్లా నందికొట్కురు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మరోసారి నోరు జారారు. గతంలో వర్గ విభేదాల నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే ఈసారి ఎన్నికల్లో నిలిచేందుకు ఇంట్రెస్ట్ లేదని సంచలన వ్యాఖ్యలు చేసి మరోమారు వార్తల్లోకెక్కారు. అందుకు కొత్తపల్లి మండల కేంద్రం వేదికైంది. బుధవారం నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో ఖంగుతిన్న నాయకులు అయోమయంలో పడ్డారు.

కాసేపటికి ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడం అందరి బాధ్యతన్నారు. నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించాలని చెప్పారు. పార్టీలో ఎవరున్నా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కర్తవ్యమన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. కొత్తపల్లిలో రహదారులు సరిగా లేకపోవడం, డ్రైనేజీ సమస్యతో పాటు ఇతర సమస్యలున్నాయని, తాను కూడా స్వయంగా పరిశీలించానన్నారు. వీటి అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రజల పట్ల అధికారులు సానుకూల థృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

అంతకుముందు ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ కరప్రతాలు అందజేస్తూ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ, డీటీ మనోహర్, ఏపీఎం పుల్లయ్య, ఈఓఆర్డీ శ్రీనివాస నాయుడు, వైసీపీ మండల నాయకులు రఫీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు దిలీప్ కుమార్, మండల నాయకులు పరశురాం, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Next Story