- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కా గృహాలకు నోచుకోని ఆదివాసీలు
దిశ, కర్నూలు ప్రతినిధి: కష్టాన్ని నమ్ముకుని బతికే చెంచులకు గూడు లేక అవస్థలు పడుతున్నారు. అడవి తల్లి ఒడిలో సేద తీరే వీరికి తలదాచుకోవడానికి కాస్తంత గూడు లేదు. ప్రభుత్వాలు ఇల్లు కట్టిస్తామని చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. వారి హామీలు పునాదులు కూడా దాటడం లేదు. దీంతో చెంచుల గూడు గోడుగానే మారింది.
చెంచులు గతంలో ఆరుబయటే నిద్రించేవారు. కాలక్రమేనా స్వచ్ఛంద సంస్థలు వారిలో మార్పును తీసుకురాగలిగాయి. ఫలితంగా వారికి కొన్ని గూడెల్లో ఆర్డీటీ సంస్థ ప్రభుత్వ సహకారంతో గృహాలు నిర్మించి ఇచ్చింది. అయితే చాలా గూడెల్లో నేటికీ పూరి గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారు. కనీసం వారి నివాసాలపై కప్పుకునేందుకు పట్టాలు కూడా ఇవ్వలేదు. వారే సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఆత్మకూరు మండలంలోని నాగలూటి గూడెంలో ఏడాది క్రితం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆర్డీటీ సంస్థ నేటికీ నిర్మాణాలకు నోచు కోలేదు.
ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలకు చేసిన పనులకు డబ్బులివ్వకపోవడంతోనే పనులు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి మండలం ఎదురుపాడు, పాతమాడుగుల, వెలుగోడు మండల కేంద్రంలోని చెంచు గూడేలు దారుణంగా దర్శనమిస్తున్నాయి. వీరికి ఎలాంటి ఆధారం లేదు. సరైన వసతి, తాగునీరు, విద్య, వైద్యం వంటివి అందని ద్రాక్షగా మారాయి. ప్రతి రోజు సప్తనదుల సంగమేశ్వర క్షేత్రానికి జిల్లా, రాష్ర్ట స్థాయి అధికారులు వెళుతున్నా రోడ్డు పక్కనే దుర్భర స్థితిలో పడి ఉన్న పాత మాడుగుల గూడెం కన్పిస్తున్నా ఎవరూ పట్టించుకోరు.
గృహాల నిర్మాణాలకు అడ్డంకులు
ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పెచ్చెర్వు గూడెంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అక్కడ నివాసం ఉండే చెంచులకు మొదటగా రూ.216 లక్షల వ్యయంతో 72 గృహాలు నిర్మించతలపెట్టింది. అందుకు 2022 ఫిబ్రవరి 8న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావుతో కలిసి ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఏడాది దాటినా అక్కడ పునాది రాళ్లు పడలేదు. అటవీ ప్రాంతంలో గృహాలు నిర్మించకుండా అటవీశాఖ అడ్డుకుంటోంది. దీంతో చెంచులు సమీపంలో లభించే వెదురు కర్రలు, గడ్డి సాయంతో గుడిసెలు ఏర్పాటు చేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. పక్కా గృహాలు నిర్మించి అక్కడ గూడెం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు, పెద్ద పులుల భారీ నుంచి రక్షణ ఉంటుందని చెంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చెంచుల అభివృద్ధికి తోడ్పడాలి
అంతరించిపోతున్న ఆదివాసీల అభివృద్ధి కోసం పాలకులు పాటుపడాలి. వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు వారికందేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకించి చాలా గూడేల్లో వారు ఉండేందుకు సరైన నివాసాలు లేవు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి మౌనం వహిస్తోంది. వీటికి తోడు అటవీశాఖ అధికారులు వీరిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఉపాధి పనులు కల్పించినా చేయనీయకుండా అడ్డుపడుతున్నారని గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నరసింహ నాయక్ వెల్లడించారు.