ఎమ్మెల్యే చక్రం.. మాజీ మంత్రి అడ్డుచక్రం!

by srinivas |   ( Updated:2024-10-07 16:04:03.0  )
ఎమ్మెల్యే చక్రం.. మాజీ మంత్రి అడ్డుచక్రం!
X

దిశ ప్రతినిధి, కర్నూలు: ఆలూరులో ఆధిపత్య పోరు సాగుతోంది. అక్కడ నేతల మధ్య నువ్వా.. నేనా? అన్న రీతిలో రాజకీయం నడుస్తోంది. అధికారం లేకపోయినా నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేయగా.. అందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అడ్డు చక్రం వేశారు. ఫలితంగా ఇరువురి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా పవన విద్యుత్ ఘటనతో పట్టు కోసం ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నించగా రంగంలోకి దిగిన మాజీ మంత్రి సోదరులు వారికి తగిన బుద్ధి చెప్పి మరోమారు తమ ఉనికిని చాటుకున్నారు. విషయం మాజీ మంత్రి దృష్టికి చేరడంతో స్వయంగా ఆయన రంగంలోకి దిగి టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేగా గెలిచినా పవర్ లేకపోవడంతో..

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఆలూరు నుంచి 2014, 2019 లో వైసీపీ తరపున గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం గుమ్మనూరుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీలో చేరి గుంతకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన జెడ్పీటీసీ బి.విరుపాక్షి టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ పై 2,831 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ర్టంలో వైసీపీ ఘోర పరాజయంతో టీడీపీ అధికారం చేపట్టింది. ఎమ్మెల్యేగా గెలిచినా పవర్ లేకపోవడం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు మింగుడు పడలేదు. ఎలాగైనా నియోజకవర్గంలో పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే కూడా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కోపానికి కారణం అదేనా..

నియోజకవర్గ కేంద్రమైన ఆలూరుతో పాటు ఆస్పరి, దేవనకొండ మండలాల్లోని పవన విద్యుత్ సంస్థల్లో తమ వారికి ఉద్యోగాలివ్వాలని వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి మూడ్రోజుల క్రితం కోరినట్లు తెలుస్తోంది. అందుకు వారు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సోదరుడు, అనుచరులు ఎమ్మెల్యే విరూపాక్షి అంటే భయం లేదా? ఆయనను కలవకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకుంటూ పోతారా? అంటూ రెచ్చిపోయి మొలగావల్లి గ్రామ సమీపంలో సీమెన్స్ గమేషా కంపెనీకి చెందిన పవన విద్యుత్ ఉప కేంద్రంతో పాటు దేవనకొండ మండలం మాదాపురం సమీపంలోని మరో ప్రైవేట్ పవన విద్యుత్ కంపెనీ కార్యాలయంపై, ఆస్పరి మండలం జోహరాపురం గ్రామంలోని మరో సంస్థ కార్యాలయాలపై దాడులు చేసి అందులోని ఫర్నిచర్ ను, సామగ్రిని ధ్వంసం చేశారు. ఇలా మూడు చోట్లా దాడులకు దిగారు.

రంగంలోకి గుమ్మనూరు బ్రదర్స్..

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చి గేటుకు వేసిన తాళం పగలగొట్టి సిబ్బందిని తిరిగి ఉప కేంద్రంలోకి పంపారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడు చోట్లా దౌర్జన్యానికి పాల్పడిన 24 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంత జరిగినా వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి మాత్రం విద్యుత్ కేంద్రానికి వెళ్లి తమ కార్యకర్తలు ఉద్యోగాలివ్వాలని అడిగారు తప్ప ఎక్కడా దాడులకు పాల్పడలేదని, అక్కడే ఉన్న టీడీపీ నాయకులే ఫర్నిచర్ అద్ధాలు ధ్వంసం చేశారని చెప్పడం, పైగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాలని కోరడం రాజకీయ చదరంగంలో భాగమేనని రాజకీయ విశ్వేషకులు చర్చించుకుంటున్నారు.

టీడీపీ బలోపేతంపై దృష్టి..

2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ వైసీపీ అభ్యర్థి బి.విరుపాక్షి చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి నేటి వరకు టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్ యాక్టివ్ గా లేరనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇక్కడ వైసీపీ జెండా ఎగిరినా పెత్తనమంతా టీడీపీదే కావడం, అందులోనూ మాజీ మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణలు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కూడా అండగా ఉంటున్నారు. చాలా రోజులుగా వీరభద్ర గౌడ్ ను ఇంచార్జి నుంచి తప్పించాలని పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీలో మంత్రిగా ఉన్న సమయంలో గెలుపొందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మళ్లీ గుమ్మనూరు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా పార్టీ శ్రేణులకు భవిష్యత్ పై భరోసా కల్పించినట్లు సమాచారం. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు మరింత కసరత్తు చేయనున్నారు.

ఆలూరు నియోజకవర్గం రెండవుతుందా?..

2029 నాటికి ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. 2026లో జరగనున్న నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా ఆలూరు, హళహర్వి, హోళగుంద, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ మండలాలతో నియోజకవర్గంగా ఉన్న ఆలూరు 2026లో ఆలూరు, చిప్పగిరి, హళహర్వి, హోళగుందతో ఒక నియోజకవర్గం, పెద్ద మండలమైన దేవనకొండను రెండు మండలాలుగా చేసి దేవనకొండ, తెర్నేకల్, ఆస్పరి, గోనెగండ్ల మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే అటు గుంతకల్, ఆలూరుతో పాటు ఇటు మరో నియోజకవర్గంలో ఇలా మూడు సెగ్మెంట్లలో పట్టు సాధించేందుకు మాజీ మంత్రి గుమ్మనూరు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మూడు సెగ్మెంట్లలో కూడా టీడీపీని బలోపేతం చేసేందుకు గుమ్మనూరు సోదరులు కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఆలూరులో టీడీపీకి గుమ్మనూరు సోదరులు వెన్నుదన్నుగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed