అలకవీడిన మల్లాది.. రేపో.. ఎల్లుండో కీలక ప్రకటన

by srinivas |
అలకవీడిన మల్లాది.. రేపో.. ఎల్లుండో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీ కేశినేని నాని.. వైసీపీలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆ రెండు పార్టీలకు చుక్కలు చూపించారు. కేశినేని చిన్నికి సీటు ఖరారు కావడంతో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీకి నాని రాజీనామా చేశారు. అనంతరం విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నుంచి హామీ తెచ్చుకున్నారు. దీంతో విజయవాడ ఎంపీ టీడీపీ టికెట్ విషయంలో కేశినేని చిన్నికి లైన్ క్లియర్ అయింది. ఆ తర్వాత టీడీపీలో వర్గ విభేదాలు సద్దుమనిగాయి.

అయితే మల్లాది విష్ణు మాత్రం కేశినేనిలా చేయలేదు. అధిష్టానం తన నియోజకవర్గంలో కొత్త ఇంచార్జి నియమించినా పార్టీ లైన్ దాటలేదు. కానీ అలకపాన్ను ఎక్కారు. దాదాపు 10 రోజులు పాటు మౌనం వహించారు. దీంతో విజయవాడ సెంట్రల్ వైసీపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా విజయవాడ సెంట్రల్‌ ఇంచార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను అధిష్టానం ప్రకటించింది. ఈ పరిణామంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒక్కసారిగా సెలైంట్ అయ్యారు. పార్టీకి పరంగా ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. స్వయంగా మల్లాది విష్ణుతో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడినా కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. అయితే ఆయన వర్గం మాత్రం వ్యతిరేకగళం విప్పింది. ఎమ్మెల్యే వెల్లపల్లికి తాము సహకరించేది లేదని తెగేసి చెప్పింది. దీంతో వైసీపీ నేతలు బుజ్జగింపుల పర్వానికి తెరదీసినా పెద్దగా వర్కట్ కాలేదు. దీంతో విజయవాడ రాజకీయాలు మరోసారి ఉత్కంఠతను రేపాయి.

ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ సెంట్రల్‌లో ఒక్కసారిగా రాజకీయ వేడి తగ్గిపోయింది. ఇందుకు కారణం మల్లాది విష్ణు అలకపాన్పు దిగడం. ఎట్టకేలకు ఆయన మౌనవ్రతం వీడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లికి సహకరించాలని తన వర్గానికి సంకేతాలిచ్చారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్సీ హామీ స్పష్టంగా రావడంతో మల్లాది వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రేపో, ఎల్లుండో విజయవాడ సెంట్రల్‌లో వెల్లపల్లి శ్రీనివాస్‌కు తాను మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. దీంతో విజయవాడ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. చూడాలి ఏం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed