Ap News: గన్నవరంలో వల్లభనేని వంశీకి షాక్.. బద్ధ శత్రువుతో చేతులు కలిపిన సన్నిహితుడు

by srinivas |   ( Updated:2023-11-16 12:49:02.0  )
Ap News: గన్నవరంలో వల్లభనేని వంశీకి షాక్..  బద్ధ శత్రువుతో చేతులు కలిపిన సన్నిహితుడు
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. వల్లభనేని వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి చాలా సార్లు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వల్లభనేని చేరికను ఆ పార్టీ నాయకుడు యార్ల వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకర్గం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. వైస్సార్ కాంగ్రెస్ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. అయితే వల్లభనేని వంశీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గన్నవరం వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. అటు వల్లభనేని టీడీపీని వీడటంతో ఆ పార్టీ నేతలు కూడా భగ్గమన్నారు. వల్లభనేని వంశీపై బహిరంగంగా ఘాటు విమర్శలు చేశారు. దీంతో వల్లభనేని వంశీ వర్గీయులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న వాహనాలకు సైతం నిప్పు పెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్‌పై వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కూడా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ బాధ్యతలు తీసుకుని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.


అయితే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావుకు మరింత బలం తోడైంది. వల్లభనేని వంశీ కీలక అనుచరుడు సర్నాల బాలాజీ టీడీపీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఇదిలాఉంటే సర్నాల బాలాజీ గతంలో టీడీపీ కీలక నేతగా ఉన్నారు. వల్లభనేని వంశీకి అన్నీ ఆయనే విధంగా పని చేశారు. గత ఎన్నికల్లో వల్లభనేని గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. నియోజకవర్గంలో వల్లభనేని తర్వాత సర్నాల బాలజీ అనేలా గుర్తింపు పొందారు. కానీ వల్లభనేని వంశీ ఎప్పుడైతే వైసీపీలో చేరారో అప్పటి నుంచి కూడా బాలాజీ తటస్థంగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదట. వల్లభనేని వంశీని కూడా పెద్దగా కలిసినట్లు కూడా జరగలేదట.


అయితే ఇటీవల నుంచి సర్నాల బాలాజీ మళ్లీ టీడీపీలో చేరాలనే యోచనలో ఉన్నారట. వల్లభనేని వంశీకి, తనకు రాజకీయంగా టీడీపీనే భవిష్యత్తునిచ్చిందని, అలాంటి పార్టీని వీడటంపై సన్నిహితుల వద్ద సర్నాల బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారట. తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీని ఎంతగా ఆదరించిందో తనకు బాగా తెలుసని చెప్పారట. చంద్రబాబు ప్రోత్సహించకపోతే వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచేవారు కారని వాపోయారట. అలాంటి టీడీపీకి వల్లభనేని వంశీ ద్రోహం చేయటం పట్ల సర్నాల బాలాజీ చాలా మంది స్నేహితులు వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారట. దీంతో తనకు భవిష్యత్తునిచ్చిన టీడీపీలోనే మళ్లీ చేరాలని నిర్ణయం తీసుకున్నారట. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలిపించాలనే కృత నిశ్చయంతో ఉన్నారట. ఈ మేరకు యార్లగడ్డ వెంకట్రావును కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. సర్నాల బాలాజీ ప్రతిభ, కృషి, పట్టదల, సత్తాను యార్లగడ్డ వెంకట్రావు గుర్తించారట. పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారట. దీంతో వెంటనే 500 మంది అనుయాయులతో కలిసి గురువారం యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.


ఈ సందర్భంగా సర్నాల బాలాజీ మాట్లాడుతూ వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని బాలాజీ వెల్లడించారు. అయితే సర్నాల బాలాజీ టీడీపీలో చేరడంపై వల్లభనేని వంశీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సర్నాల బాలాజీ తనతో ఉంటే చాలా బలంగా ఉండేదని సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి బలంగానే ఉన్నట్లు భావిస్తున్నారట. ఏది ఏమైనా గత ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన సర్నాల బాలాజీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, బుజ్జగించకపోవడం పట్ల పార్టీ కేడర్‌లోనూ చర్చ జరుగుతోందట. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story