చంద్రబాబు పర్యటనలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం

by srinivas |   ( Updated:2023-04-14 13:28:27.0  )
చంద్రబాబు పర్యటనలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం
X

దిశ, ఏపీ బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్ షో గురువారం గుడివాడ చేరుకుంది. దీంతో అక్కడ వైసీపీ నేతల తీరుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేయడం, అలాగే రోడ్ షోపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా చంద్రబాబుకు దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టారు. జన స్పందనతో చంద్రబాబు రోడ్ షో ముందుకు సాగింది. ఈ క్రమంలో గుడివాడలో వైసీపీ కార్యాలయం వద్ద, శరత్ థియేటర్ దగ్గర కొడాలి నాని కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీ వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జై జగన్.. జై నాని అంటూ నినాదాలు చేశారు.


స్పందించిన పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతోత్సవాలను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం నిమ్మకూరు గ్రామస్తులతో చంద్రన్న'ఆత్మీయ సమ్మేళనం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నందమూరి కుటుంబం తరపున చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి రామకృష్ణ కొత్త వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏం చేసినా చరిత్రేనని, సినీ రంగంలో ఉంటూ సామాజిక బాధ్యతతో ఆలోచించారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకొచ్చి సాయం అందించారని గుర్తు చేశారు. తెలుగు భాష అంతరిస్తే..జాతి అంతరిస్తుందని ముందే ఊహించారన్నారు. కృషి, పట్టుదలతో మహోన్నత వ్యక్తిగా అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకునే సమయంలో తనతో చెప్పేవారని, జనం కోసం ఆయన పని చేశారన్నారు. తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. సాంకేతికతను ముందుచూపుతో ప్రోత్సహించామన్నారు. హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌గా ఉందంటే అది టీడీపీ పాలనకు నిదర్శనమని, ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్ట్, హైటెక్‌ సిటీ టీడీపీ పాలనను గుర్తు చేస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ నడయాడిన నేలపై తాము తిరగడం ఆనందంగా ఉందన్నారు. సామాన్యమైన‌ కుటుంబంలో పుట్టి యుగ పురుషుడిగా చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్‌‌కు ఎవరూ సాటిరారన్నారు. ప్రపంచంలోనే తెలుగు వాడికి గౌరవం దక్కిందంటే నాడు ఎన్టీఆర్‌, నేడు చంద్రబాబు మాత్రమే కారణమని చెప్పారు. ఎన్టీఆర్‌ శత జయంతోత్సవాలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతోత్సవాలలో వంద సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రిలో వందో సభ ఎన్టీఆర్‌ జయంతి రోజున చాలా ఘనంగా నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Also Read..

చంద్రబాబు ఉండగానే రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత

Advertisement

Next Story