ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాత పాలన పోయేదెన్నడో?

by Mahesh |
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాత పాలన పోయేదెన్నడో?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మార్పుల కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేసిన పాత వీసీ ప్రసాద్ రెడ్డి స్థానంలో కొత్తగా వీసీని నియమించడం, రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గేట్లు తొలగించడం మినహా పాలనాపరమైన మార్పులు ఏమీ రాలేదు. వైసీపీ పాలనా కాలంలో నియమితులైన వారెవరినీ ఇంకా ఆ పదవుల నుంచి తొలగించలేదు. విశాఖలో కూటమికి లక్షల్లో మెజారిటీకి ప్రధాన కారణాల్లో ఒకటైన ఏయూ అరాచక పాలన పై విచారణ ఊసే లేదు. దీంతో కూటమి పాలన ప్రారంభమై 50 రోజులు పూర్తి అయిన ఇంకా మార్పు రాకపోవడం పట్ల ఏయూ పరిరక్షణ సమితి అందోళనను కొనసాగిస్తూనే ఉంది.

రిజిస్ర్టార్, డీన్‌లను మార్చరా?

మాజీ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా చేసే ముందు కిషోర్ బాబును ఇన్చార్జి రిజిస్ర్టార్‌గా నియమించారు. కూటమి ప్రభుత్వం జూలై నెలలో శశిభూషణ రావును ఇన్చార్జి వీసీగా నియమించింది. వీసీని నియమించగానే ఆయన టీంను ఏర్పాటు చేసుకోవాలి. అయితే విచిత్రంగా పరిపాలన బాధ్యతలను నిర్వర్తించే రిజిస్ర్టార్ పోస్టులో కిషోర్ బాబునే ఇంకా కొనసాగిస్తున్నారు. ఏయూలో కీలకమైన యూజీసీ రిసెర్చ్ , డెవలప్మెంట్ డీన్, కళాశాలల వ్యవహారాలు పర్యవేక్షించే సీ డీ సీ డీన్‌లుగా ప్రసాదరెడ్డి నియమించిన వ్యక్తులే కొనసాగుతున్నారు.

ఎయిడెడ్ కళాశాలల నుంచి వచ్చిన వారే హెడ్‌లు

విశ్వవిద్యాలయంలో ఐదు విభాగాలకు ఎయిడెడ్ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు హెడ్‌లుగా కొనసాగుతున్నారు. విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్ధాలుగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ప్రోఫెసర్‌లను కాదని ప్రసాదరెడ్డి తన ఇష్టానుసారం వీరిని నియమించారు. అసలు ఎయిడెడ్ అధ్యాపకులను ఆయా కళాశాలలకు పంపించి వారి స్థానంలో గతంలో మాదిరిగా గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాలనే డిమాండు ఎప్పటి నుంచో ఉంది. వీరిని కళాశాలలకు పంపే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకున్నా కనీసం హెడ్‌ల నుంచి తప్పించే పనికూడా చేయకపోవడమేమిటన్న ప్రశ్న వస్తుంది.

లీగల్ సెల్ మారలేదు

విశ్వవిద్యాలయంలో లీగల్ సెల్ అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. పలు వివాదాలకు సంబంధించి అభిప్రాయం చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తమ అభీష్టం మేరకు, పాలసీ మేరకు నిర్ణయాలు జరగాలంటే పాత లీగల్ సెల్‌ను మార్చి కొత్త వారిని నియమించాలి. దానిపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. పాత వీసీ ప్రసాద్ రెడ్డి నియమించిన వీరు ఆయన సూచనల మేరకే పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

విచారణ తరువాత.. పర్యవేక్షణ ఏది

మాజీ వీసీ ప్రసాదరెడ్డి పేరు నారా లోకేష్ రెడ్ బుక్‌లో ఉందని , ఆయనపై చర్యలు తప్పవని ఎన్నికల ప్రచార సమయంలో పెద్ద ఎత్తున కూటమి నేతలు ప్రచారం చేశారు. విచారణ, చర్యల సంగతి తర్వాత కనీసం ఆయనపై పర్యవేక్షణ కూడా కరువైందని ఆయన హయాంలో వేధింపులకు గురైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ సతీమణి ప్రోఫెసర్ లావణ్య వంటి వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లావణ్య గంట ఆలస్యంగా వచ్చినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకొన్న ప్రసాదరెడ్డి ఇప్పుడు జూలై నెలలో అసలు విధులకు హాజరుకాకుండా అటెండెన్స్ రిజిస్టర్‌ను మాయం చేశారని, ఆగస్టులో మధ్యాహ్నం 12.30 గంటలకు విధులకు వస్తున్నా అడిగేవారే లేరని ఆయన బాధితులు వాపోతున్నారు. ప్రసాదరెడ్డి వ్యవహారాలపై నేరుగా నారా లోకేష్ వద్దకే వెళ్లి ఫిర్యాదు చేయాలని పలువురు ప్రొఫెసర్లు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed