రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు విచారణ

by Seetharam |   ( Updated:2023-09-22 10:15:39.0  )
రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు విచారణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ విజ్ఞప్తి మేరకు చంద్రబాబును రెండు రోజులపాటు కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారిస్తారా? లేక తటస్థ ప్రాంతంలో చేస్తారా అని జడ్జి సీఐడీ తరఫు న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి కావడం అందులోనూ... బయటకు వస్తే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారిస్తామని సీఐడీ తెలిపింది. దీంతో ఏసీబీ కోర్టు రాజమహేంద్రవరంలోనే చంద్రబాబు నాయుడును కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందులోనూ చంద్రబాబు నాయుడు రిమాండ్ కేవలం రెండు రోజులమాత్రమే ఉంది. అలాగే టెక్నికల్‌ ప్రకారం ఏదైనా కేసులో నిందితుడు అరెస్ట్ అయితే 15 రోజుల్లోగా రిమాండ్ తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఆదివారం నాటికి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి 15 రోజులు అవుతున్న నేపథ్యంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల విచారణ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారిస్తే సమయభావం కలిసి వస్తుందని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును రెండు రోజులపాటు కస్టడీకి ఇస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.‘విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. 140 మంది సాక్షులను విచారిచి 4000 డాక్యుమెంట్లను సీఐడీ సేకరించి వాటిపై దర్యాప్తు చేస్తున్నందున తాము ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

స్కిల్ స్కామ్ కేసులో అక్రమార్జనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. కేసు విచారణను పారదర్శకంగా జరగాలి. అందుకే క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నాం’ అని ఏపీ హైకోర్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. హైకోర్టు తీర్పు కాపీని సైతం పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. స్కిల్ స్కామ్ కేసులో కుట్ర దాగి ఉందని.. నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు ఎలా వెళ్లాయో సమాచారం తమ దగ్గర ఉందని ఈ నేపథ్యంలో విచారించేందుకు చంద్రబాబు నాయుడును రిమాండ్‌కు ఇవ్వాలన్న సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీ భవించారు. ఈ మేరకు రెండు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Read More :

బిగ్ బ్రేకింగ్: సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఒక్కరోజే మూడు వరుస ఎదురుదెబ్బలు

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Advertisement

Next Story