ఆంధ్రప్రదేశ్ ప్రజలకు KCR బహిరంగ క్షమాపణ చెప్పాలి : GVL Narasimha Rao

by Harish |   ( Updated:2023-01-03 07:56:06.0  )
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు KCR బహిరంగ క్షమాపణ చెప్పాలి : GVL Narasimha Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో: మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లోకి టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అడుగు పెడితే ఊరుకునేది లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. ఈ రోజు లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా వాళ్ళను కుక్కలు.. తరిమి తరిమి కొట్టండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ ఆంధ్రాలో పార్టీ ఎలా పెడతారని అన్నారు.

ఆంధ్రకు నీరు నిలిపివేశారు.. కృష్ణా ట్రిబ్యునల్ అడ్డుకున్నారు.. ఏం ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తావు.. అంటూ కేసీఆర్ ని జీవీఎల్ ప్రశ్నించారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించారు. విభజన బిల్లు సమస్యలు పరిష్కారం కాలేదని ఆంధ్రకు రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. కొవిడ్ సమయంలో ఆంధ్రా వాళ్ళను అడ్డుకున్నారు అని గుర్తు చేశారు.

ఆంధ్ర పాలకులు చంద్రబాబు ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నందునే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు పడవు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని జీవీఎల్ జోష్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కేసీఆర్ వీడియోలు వినిపించారు.

మాకు తెలంగాణ పార్టీలు అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్‌లకు కేసీఆర్‌ని విమర్శ చేయాలంటే భయం అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన మీరు పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఆంధ్రాలో కుల రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఆంధ్రాలో కొంతకాలం సభలు, ర్యాలీలు నిషేధించాలని ప్రభుత్వానికి సూచన చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎం రవీంద్ర, ఉపాధ్యక్షుడు దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Read more:

Chandrababu ఎఫెక్ట్: AP government సంచలన నిర్ణయం

Advertisement

Next Story