రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీలోకి.. కన్నా లక్ష్మీనారాయణ

by Vinod kumar |   ( Updated:2023-02-23 12:37:07.0  )
రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీలోకి.. కన్నా లక్ష్మీనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు.. కన్నా లక్ష్మీనారాయణ మెడలో టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తోపాటు వెయ్యి మందికి పైగా ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

వారందరికీ చంద్రబాబు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో భారీ కాన్వాయ్‌తో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం 2:48 గంటలకు తెలుగుదేశం పార్టీలో చేరారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి యాభై వాహనాలతో భారీ కాన్వాయ్‌తో అనుచరులు చేరుకున్నారు.

రాక్షసుడిని తరిమి కొట్టాలి : కన్నా

రాష్ట్ర భవిష్యత్ కోసం, అమరావతి రాజధానిని పరిరక్షించుకునేందుకు తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని.. దేశమంతా ఆయనవైపు చూస్తుందని అలాంటి తరుణంలో కూడా తాను బీజేపీని వీడానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలనను అంతం చేయాలి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగా పని చేశానని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. 'ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస క్రీడను ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అంటే ప్రజాస్వామ్య వాదులు అంతా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఒక అవకాశం ఇవ్వండి తన తండ్రిని మైమరిపిస్తానని చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం సంపదను దోచుకుని వ్యాపారం చేసుకుంటున్నారు' అని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ పట్టుకెళ్లినంత ధోరణిలో వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

రూ.9.50 లక్షల కోట్లు తన సొంత డబ్బులు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని కన్నా మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకువస్తున్న జగన్ రెడ్డి ఆ సొమ్మును ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు అమరావతి రాజధాని గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగీకరించిన సీఎం జగన్ తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటున్నారని ధ్వజమెత్తారు.

అమరావతి అయితే ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలి ఆ తర్వాతే దోచుకోవాలి.. అదే విశాఖపట్నం అయితే ఇప్పటికే అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ దోచుకోవాలనే ఉద్దేశంతోనే విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల అరాచకాలు, కబ్జాలతో విశాఖ ప్రజలు భయాందోళన చెందుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

డీజీపీ కార్యాలయం వద్ద భారీ భద్రత..

టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా టీడీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆయన అనుచరులు భారీగా తరలి రావడం తో డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గన్నవరం విధ్వంసం నేపథ్యంలో డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి టీడీపీ కార్యాలయం వరకు వెళ్లే రోడ్డు అలాగే సర్వీసు రోడ్డు-జాతీయ రహదారి మధ్య ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లే సర్వీస్ రోడ్డులో మూడంచెల బారికేడ్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed