- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సురేంద్రబాబుకే కళ్యాణదుర్గం టీడీపీ టికెట్..?
దిశ ప్రతినిధి, అనంతపురం/ కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎస్సార్ ఇన్ ఫ్రా అధినేత అమిలినేని సురేంద్రబాబుకు ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును మంగళవారం ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఒక్కటయ్యారు. ఐదేళ్లుగా ఎవరికి వారు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన వారు ఇప్పుడు ఏకం కావడం జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎవరీ సురేంద్ర బాబు..?
ఉరవకొండ మండలం అమిధ్యాల గ్రామానికి చెందిన అమిలినేని సురేంద్రబాబు ప్రముఖ కాంట్రాక్టు సంస్థ ఎస్ ఆర్ ఇన్ఫ్రా అధినేతగా కొనసాగుతున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీ నుంచి వైదొలిగారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అనంతపురం టికెట్ దాదాపు ఖరారైంది. అయితే, చివరి క్షణంలో ప్రభాకర్ చౌదరిని అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. దీంతో సురేంద్రబాబు మరోసారి భంగపాటుకు గురయ్యారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈసారి మాత్రం ఆయన కళ్యాణదుర్గం పై దృష్టి సారించారు. అక్కడ ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు రెండు వర్గాలుగా విడిపోయి.. ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించరనే అభిప్రాయం సర్వత్రా ఉంది. దీన్ని అవకాశంగా తీసుకున్న సురేంద్రబాబు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందంగా టికెట్ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 26న సురేంద్రబాబు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నట్టు సమాచారం. అనంతరం 28న నియోజకవర్గంలో ఆయన అడుగు పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే శెట్టూరు రోడ్డులో సుమారు రెండెకరాల్లో పార్టీ కార్యాలయం, నివాస భవనాల నిర్మాణానికి ఆయన కుమారుడు భూమి పూజ కూడా చేశారు. ఈ నెల 28న నియోజకవర్గానికి సురేంద్ర బాబు రానుండడంతో ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
స్థానికులకే అవకాశమివ్వాలి: ఉన్నం, మాదినేని
కళ్యాణదుర్గం టీడీపీలో ఇంతకాలం ఎడమొహం పెడమొహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంత రాయ చౌదరి, నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు ఇప్పుడు ఒక్కటయ్యారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం వారు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాలతో ఐదేళ్లుగా తాము పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తూ వచ్చామన్నారు. ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఇకపై కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే టికెట్ ఇవ్వాలని కోరారు. అలా కాదని కళ్యాణదుర్గం ముఖం చూడని వారికి, స్థానికేతరులకు టికెట్ ఇస్తే అంగీకరించబోమని స్పష్టం చేశారు. అనంతరం రెండు వర్గాల వారు కలిసి ఇరువురి ఇళ్ల వద్దకు వెళ్లి తేనేటి విందులో పాల్గొన్నారు. మరి వీరిద్దరూ ఎంత వరకు కలిసి ప్రయాణిస్తారో వేచి చూడాలి.