మంత్రులతో ఉద్యోగ సంఘాల భేటీ.. జీవోలు రద్దు చేస్తేనే చర్చకు

by Disha News Desk |
మంత్రులతో ఉద్యోగ సంఘాల భేటీ.. జీవోలు రద్దు చేస్తేనే చర్చకు
X

దిశ, ఏపీ బ్యూరో : పీఆర్సీ, ఉద్యోగుల సమస్యలపై పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. మంగళవారం విజయవాడలో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు సుమారు రెండు గంటలపాటు చర్చించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు, చర్చలకు ఆహ్వానిస్తున్న అంశం, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం పీఆర్సీ సాధన సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... పీఆర్సీపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిలు పాల్గొన్నారు. ఉద్యోగులకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని మంత్రుల కమిటీకి రాసే లేఖలో పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసింది. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను కూడా బయటపెట్టాలని.. మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు మళ్లీ చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కాంట్రాక్ట్, ఎన్ ఎం ఆర్ ఉద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెడతామని పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది.

మంత్రుల కమిటీకి వినతిపత్రం అందజేత

ఎట్టకేలకు ఉద్యోగ సంఘాలు మెట్టు దిగాయి. పీఆర్సీ సహా ఇతర సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. 3 కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఓ వినతి పత్రాన్ని మంత్రుల కమిటీకి అందజేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలను బయటపెట్టాలని.. పీఆర్సీ జీవోలను అబయెన్స్‌లో పెట్టాలని, జనవరి నెల పాత పీఆర్సీ ప్రకారం జీతాలను చెల్లించాలని లేఖలో కోరారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే.. చర్చకు సిద్ధమని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇకపోతే ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల కోసం.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

ఈ కమిటీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు సోమవారం ఆహ్వానం పంపింది. అయితే పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పింది. సోమవారం ఉద్యోగుల కోసం సచివాలయంలో మంత్రుల కమిటీ వేచి చూసినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లలేదు. దీంతో మంగళవారం కూడా సచివాలయంకు మంత్రుల కమిటీ చేరుకుంది. ఉద్యోగ సంఘాలను రెండో రోజు చర్చకు ఆహ్వానించింది. అయితే పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Next Story