- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janasena సోషల్ వార్.. 'జగనన్న మోసం' హ్యాష్‌ట్యాగ్ ఫలితమిచ్చేనా..
"పేదల గృహ నిర్మాణంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పది నుంచి 20 లక్షలు విలువ చేయని భూములను చేతులు మార్చి రూ. 70 లక్షలదాకా చెల్లించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల్లేవు. లబ్దిదారులకు నరకం చూపిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. అందుకే ఈ నెల 12 నుంచి 14 దాకా జగనన్న కాలనీలను క్షేత్ర స్థాయిలో జన సైనికులు పరిశీలిస్తారు. వాస్తవాలను ప్రతిబింబిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతాం. హ్యాష్‌ట్యాగ్‌తో 'జగనన్న మోసం' ఇదేనంటూ ప్రజలకు వివరిస్తాం.." అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేదల గృహ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఒకసారి చూద్దాం...
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్లో ప్రధానమైన పేదల గృహ నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. కొన్నిచోట్ల తలెత్తిన సమస్యల కారణంగా సుమారు 26 లక్షల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అందులో 17 జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 18,63,552 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీనిచ్చింది. ఇప్పటిదాకా 52 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగింది. క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఎప్పటికప్పుడు వాటిని దాటుకుంటూ ఎలాగైనా తాము మాత్రమే ఇన్ని లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామని చెప్పుకునేందుకు ప్రభుత్వం తహతహలాడుతోంది.
మూడు కేటగిరీలు.. ముప్పుతిప్పలు
తొలుత లబ్దిదారులను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆచరణలో దీనికి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అర్బన్ లేఅవుట్లు నగరాలు, పట్టణాలకు దూరంగా ఉన్నందున నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లడం లబ్దిదారులకు కష్టమైంది. లేఅవుట్లలో రోడ్లు, నీళ్లు, కరెంటులాంటి సదుపాయాలు కల్పించకుండానే నిర్మాణాలు మొదలు పెట్టాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. పనులు నత్తనడకన కొనసాగడంతో నిర్మాణ సామగ్రి నిల్వ కోసం షెడ్లు వేయించారు. బోర్లు వేసి కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత నిర్మాణాలు కాస్త ఊపందుకున్నాయి. ప్రస్తుతం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల పనులు మందగించాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో లే అవుట్లు ఊరికి దగ్గరగా ఉండడంతో ఇలాంటి సమస్యలు పెద్దగా లేవు.
నిర్మాణ సామగ్రి అందించినా...
రెండో కేటగిరీలో ప్రభుత్వమే సిమెంటు, ఐరన్‌తోపాటు ఇతర సామగ్రిని అందజేసేందుకు ముందుకు వచ్చింది. దశలవారీ నిర్మాణం చేపట్టడంతో పనులు వేగం పుంజుకోలేదు. రెండో కేటగిరీ లబ్దిదారులంతా పేదలు, దిగువ మధ్యతరగతి జనాలే. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సామగ్రి ఇస్తున్నా బేల్దార్లు, కూలీలకు వేతనాలు ఇవ్వడానికి నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పేదల పరిస్థితి మరీ దారుణం. కనీసం అప్పు కూడా పుట్టని నిరుపేద లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం చాలా మందకొడిగా జరుగుతోంది.
మేం ఇళ్లు కట్టుకోలేం...
ఇక మూడో కేటగిరీ లబ్ధిదారులు పూర్తిగా చేతులెత్తేశారు. తాము ఇళ్లు కట్టుకోలేమని తేల్చి చెప్పేశారు. ఇల్లు కడితేనే ఇళ్ల పట్టాలు ఇస్తామంటే అక్కర్లేదు పొమ్మన్నారు. ఎవరికైనా సొంతింటి కల నెరవేర్చుకుందామని ఉంటుంది. ఈ కేటగిరీలో ఉన్నోళ్లంతా కడు పేదలు. రోజువారీ పనిచేసుకుంటేనే పూట గడిచేది. సొంతంగా ఒక్క రూపాయి వెచ్చించలేని దుస్థితి. గత్యంతరం లేనిస్థితిలో ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్లకు ఇచ్చేసింది. కాంట్రాక్టర్లు చాలా చోట్ల పనులు మొదలు పెట్టినా బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల అసలు మొదలు పెట్టనేలేదు.
ఖర్చు బారెడు... సాయం మూరెడు
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది భూసేకరణ, లేఅవుట్లు, మౌలిక సదుపాయాల కోసమే. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.1.85 లక్షల చొప్పున ఇస్తోంది. దీంతో సెంటు, సెంటున్నర స్థలంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంటి నిర్మాణం సాధ్యం కాదు. అందుకే లబ్దిదారుల్లో పొదుపు మహిళలుంటే రూ.30 వేల చొప్పున బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నారు. ఇంకా ఇంటి నిర్మాణం సొంతంగా చేసుకుంటే ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి వేతనాలు ఇప్పిస్తున్నారు. ఇన్నిచేసినా ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో సగం కూడా లేదు.
ప్రభుత్వ సాయం పెంచాల్సిందే...
ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం లబ్దిదారులు సొంతంగా ఇల్లు కట్టుకుంటే కనీసంగా రూ. 5 లక్షలకుపైనే ఖర్చవుతుంది. ఒకవేళ కాంట్రాక్టరు నిర్మించినా సగానికి సగం వ్యత్యాసం ఉండదు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే కేంద్రం ఇచ్చే మొత్తాన్ని పెంచాలని లబ్దిదారులు కోరుతున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ఇరవై కింద ఇచ్చే ఇంటికి రూ.1.85 లక్షలే కేటాయిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో సామగ్రి ధరలు రెండు రెట్లు పెరిగాయి. మార్కెట్ ధరలను అనుసరించి ఇంటి వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వ సాయాన్ని పెంచాలి. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ఆర్థిక సమస్యల్లో నిండా మునిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం కేంద్రాన్ని అడిగే సాహసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది. ప్రతిపక్షాలైనా లబ్ధిదారుల పక్షాన నిలిచి గళం విప్పుతారనుకుంటే అదీ లేదు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ప్రతిపక్ష నేతలకు లేదు.
జనసేన ఉద్యమానికి స్పందన ఎలా ఉంటుందో...
ఇప్పుడు జనసేన తలపెట్టిన ఉద్యమానికి లబ్ధిదారుల నుంచి ఏమేరకు మద్దతు లభిస్తుందో చెప్పలేం. జనసేనకు మద్దతుగా నిలిస్తే బిల్లులు సక్రమంగా రావేమో.. ఇల్లు దక్కదేమోనన్న అనుమానాలు తలెత్తవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసంగా నోరెత్తకపోవచ్చు. జనసేన గతంలో రోడ్ల దుస్థితిపై ఇలాగే క్యాంపెయిన్ చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అంతా హర్షించారు. ప్రభుత్వం కూడా స్పందించి ఆగమేఘాలపై రోడ్ల మరమ్మతులకు పూనుకుంది. మరి పేదల గృహ నిర్మాణం విషయంలో జన సైనికుల క్యాంపెయిన్‌కు లబ్ధిదారుల నుంచి ఏమేరకు స్పందన వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.