గోదావరి జిల్లాల లిస్ట్ పై జగన్ ఫోకస్: పలువురు సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరణ

by Seetharam |   ( Updated:2023-12-19 06:16:01.0  )
గోదావరి జిల్లాల లిస్ట్ పై జగన్ ఫోకస్: పలువురు సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్లాన్‌ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలకు స్థాన చలనం, లేకుంటే టికెట్ ఇవ్వలేమని తెగేసి చెప్పేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానచలనం కల్పించారు సీఎం వైఎస్ జగన్. అంతేకాదు కొందరికి టికెట్ లేదని తేల్చి చెప్పేశారు. ముగ్గురు మంత్రులకు సీఎం వైఎస్ జగన్ స్థాన చలనం కల్పించడం సంచలనంగా మారింది. ఇకపోతే ఈ ఇన్‌చార్జిల మార్పుల వ్యవహారం రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో జనసేన, టీడీపీలకు మాంచి పట్టుంది. ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలనే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉభయగోదావరి జిల్లాలో పలు సర్వేలలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో సీఎం వైఎస్ జగన్‌‌ను కలిసిన వారికి టికెట్ ఇవ్వలేమని ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ‘టికెట్ ఇవ్వలేదని నిరుత్సాహపడద్దని…ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు దిశగా కృషి చేయాలని.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని చూసుకుంటాం’ అని హామీ ఇచ్చి బుజ్జగించి పంపినట్లుగా ప్రచారం జరుగుతుంది.

గెలుపు గుర్రాలపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఎట్టి పరిస్థితులలో వైసీపీ అధికారంలోకి రావడమే పరమావధిగా వైఎస్ జగన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆర్థిక, అంగ, సామాజిక సమీకరణాలే ప్రామాణికంగా చేసుకుని అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. అంతేకాదు ఐప్యాక్, ఇతర సర్వేలలో నెగిటివ్ ఫలితం వస్తే మాత్రం టికెట్ లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలు. ఈ ఉభయగోదావరి జిల్లాలపై సీఎం వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్టులను పరిశీలించి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయి టికెట్ ఇవ్వలేమని బుజ్జగించినట్లు తెలుస్తోంది.

టికెట్లు ఇచ్చే అంశంపై చర్చ

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇన్‌చార్జిల మార్పుపై కసరత్తు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారని తెలియడంతో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఆ టెన్షన్‌కు తగినట్లుగానే సీఎం వైఎస్ జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలు, మరికొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైసిపి ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

ముగ్గురికి స్థాన చలనం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎస్సీ శాసన సభ్యులు, ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని సీఎం వైఎస్ జగన్ ఖరాఖండిగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ‘టికెట్ ఇవ్వలేదని నిరుత్సాహపడద్దని…ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు దిశగా కృషి చేయాలని.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని చూసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్ బలంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed